Telangana: పంట చేతికి రాగానే ప్రాణాలు పోతున్నాయి.. రోడ్లపై మృత్యు రాశులు..

పంట చేతికొస్తే పండగ కావాలి.. కానీ అదే పంట పచ్చని ప్రాణాలను బలితీసుకుంటుంది.. అన్నదాత రెక్కల కష్టం రోడ్లపైకి వస్తే.. ఎదురొచ్చే బాటసారులకు అది మృత్యుపాశంగా మారుతోంది. చేతికి వచ్చిన పంటను ఆరబెట్టుకోవడానికి కల్లాలు లేక రైతులు రోడ్లనే ఎంచుకుంటున్నారు.. కుప్పల చుట్టూ పెడుతున్న బండరాళ్లు అమాయక ప్రయాణికులను కాటికి పంపుతున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: పంట చేతికి రాగానే ప్రాణాలు పోతున్నాయి.. రోడ్లపై మృత్యు రాశులు..
Paddy Piles On Roads Turn Death Traps

Edited By:

Updated on: Nov 06, 2026 | 3:39 PM

పంట చేతికొచ్చిన వేళ అన్నదాత ముఖంలో ఆనందం వెల్లివిరియాలి. కానీ ఆ పంట రాశులే అమాయక బాటసారుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. రహదారులపై ఆరబోసిన ధాన్యపు కుప్పలు, వాటి రక్షణ కోసం చుట్టూ పెడుతున్న బండరాళ్లు రోడ్లను ప్రమాదాల అడ్డాగా మారుస్తున్నాయి. రెక్కల కష్టాన్ని ఆరబోసుకునేందుకు సరైన వసతులు లేవని రైతులు చెబుతుంటే, ఈ నిర్లక్ష్యానికి రహదారులపై రాకపోకలు సాగించే సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు, అధికారులు మేల్కొనకపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ధాన్యం, మొక్కజొన్న నూర్పిళ్లు ప్రారంభం కాగానే ప్రధాన, గ్రామీణ రహదారులన్నీ కల్లాలుగా మారిపోతున్నాయి. ధాన్యం నలిగిపోకుండా రైతులు కుప్పల చుట్టూ భారీ బండరాళ్లను, మొద్దులను అడ్డంగా పెడుతున్నారు. రాత్రి వేళల్లో, పొగమంచు సమయంలో ఎదురుగా వచ్చే వాహనాల వెలుతురులో ఈ రాళ్లు కనిపించక ద్విచక్ర వాహనదారులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారు.

గత ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇలాంటి ఘటనల్లో 38 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఎందరో తీవ్ర గాయాలతో అంగవైకల్యం పాలయ్యారు. ముఖ్యంగా వరంగల్ శివారు ఐనవోలు రహదారిపై వరికుప్పల బండరాళ్లు తగిలి వెంకటరెడ్డి, చిన్నయాకూబ్ అనే ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన జిల్లా ప్రజలను ఇప్పటికీ కలచివేస్తూనే ఉంది.

కల్లాలు లేవు.. కొనుగోళ్లు సాగవు: అన్నదాతల ఆవేదన

రహదారులపై ధాన్యం ఆరబోయడాన్ని సమర్థించలేకపోయినా, తమ గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంటను ఎండబెట్టుకోవడానికి ఉమ్మడి కల్లాలు లేవు. పొలాల వద్ద సరైన నేల వసతి ఉండదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అకాల వర్షాలు, తుపాన్లు ముంచెత్తకముందే త్వరగా ఆరబెట్టుకోవడానికి తారు రోడ్లే అనువుగా ఉంటున్నాయని రైతులు చెబుతున్నారు. ధాన్యం చేతికి వచ్చిన వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి, తేమ శాతం పేరిట కొర్రీలు పెట్టకుండా వెంటనే కొనుగోలు చేస్తే రోడ్లపైకి రావాల్సిన అవసరం ఉండదని అన్నదాతలు స్పష్టం చేస్తున్నారు.

కేవలం హెచ్చరికలేనా.. పరిష్కారం లేదా?

ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, అధికారులు స్పందించి రోడ్లపై ధాన్యం పోస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరికలు జారీ చేయడం.. అలైవ్ – అరైవ్ వంటి అవగాహన సదస్సులు నిర్వహించడం పరిపాటిగా మారింది. అయితే కేవలం కేసులతోనో, నిబంధనలతోనో ఈ సమస్య పరిష్కారం కాదన్నది సుస్పష్టం.

శాశ్వత పరిష్కారానికి మార్గాలు

గ్రామాల్లో ప్రభుత్వ కల్లాలు: ఉపాధి హామీ పథకం లేదా ఇతర నిధుల ద్వారా ప్రతి గ్రామంలో కాంక్రీట్ కల్లాలు, కమ్యూనిటీ డ్రైయింగ్ ప్లాట్‌ఫారమ్‌లు యుద్ధప్రాతిపదికన నిర్మించాలి.

టార్పాలిన్లు, డ్రైయర్ల రాయితీ: ధాన్యాన్ని త్వరగా ఎండబెట్టేందుకు అవసరమైన పరికరాలు, కవర్లను రైతులకు సబ్సిడీపై అందించాలి.

వేగవంతమైన కొనుగోళ్లు: పంట కోతలకు ముందే కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసి, తేమ ఆరగానే ఆలస్యం లేకుండా ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి.

హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు: అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు పక్కన ఆరబోయాల్సి వస్తే, బండరాళ్లకు బదులుగా రేడియం కోన్లు, స్పష్టంగా కనిపించే ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసేలా అధికార యంత్రాంగం పర్యవేక్షించాలి.

రైతు కష్టం బూడిదపాలు కాకూడదు.. అదే సమయంలో బాటసారి ప్రాణం గాల్లో కలవకూడదు. అధికారులు ఇకనైనా హెచ్చరికలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి అమాయకుల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us