
గడ్డిమందు తాగితే ఎలా ఉంటుందో తెలుసా. నొప్పి, మంట కాదది.. అదొక నరకయాతన. నోరు, నాలుక, గొంతు పూర్తిగా కాలిపోతుంది. కడుపు లోపలి వరకు ఉండే పైపు కాలిపోయి, చిల్లులు పడుతుంది. విపరీతమైన కడుపునొప్పి. అసలైన నరకం.. స్పృహ కోల్పోకపోవడం. స్పృహలోనే ఉంటారు గానీ.. గాలి అందక నీటి నుంచి బయటపడ్డ చేపలా గిలగిలాకొట్టుకుంటారు. లోపల అవయవాలు ఎలా కాలిపోయి కుళ్లిపోతున్నాయో, ఊపిరి ఎలా అందడం లేదో తెలుస్తుంది. అంతటి బాధను పెద్దోళ్లే తట్టుకోలేరు. మరి.. చిన్నారులకు తాగిస్తే? అంత క్రూరంగా తాగించాడీ తండ్రీ. కొన ఊపిరి ఉందనో, కసి తీరకనో.. గడ్డిమందు తాగించిన అవే చేతులతో బావిలోకి తోసేశాడు! కారణం ఒక్కటే.. ఆ తండ్రి కడుపున ఆడపిల్లలుగా పుట్టడమే. ఈ కవలలు ఊరంతటికీ ఎంత ప్రత్యేకమో.. ‘బంగారం లాంటి పిల్లలు’ అని చూసి ఎంత మురిసిపోతారో ఈ అంగన్‌వాడీ ఆయమ్మను చూస్తే చాలు. ఫ్లెక్సీలో ఈ కవలలను చూసి.. ‘చిన్ను, జున్ను.. రండమ్మా అన్నం పెడతా’.. ‘కోడి గుడ్డు కూడా దాచి ఉంచా తిందురు రండమ్మా’ అని పిలుస్తుంటే.. గుండె తరుక్కుపోయింది అక్కడున్న వాళ్లకి. ఆ ఫ్లెక్సీలో ఈ చిన్నదాన్ని ప్రత్యేకంగా చూపించి… ‘ఈ బుడ్డది ఏం చేస్తుందో తెలుసా.. గుడ్డు సగం తిని,...