Telangana: 50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం..

భక్తికి, సంప్రదాయానికి మధ్య ఎప్పుడూ ఒక సున్నితమైన రేఖ ఉంటుంది. కానీ ఆ సంప్రదాయం మూగజీవాల పాలిట మృత్యుపాశంగా మారినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జగిత్యాల జిల్లా రాయికల్ భీమన్న జాతరలో తరతరాలుగా వస్తున్న గావు పట్టే ఆచారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Telangana: 50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం..
Criminal Case Filed Over Animal Sacrifice

Edited By:

Updated on: Feb 07, 2026 | 11:03 AM

జగిత్యాల జిల్లా రాయికల్ భీమన్న జాతర ఇప్పుడు ఒక చట్టపరమైన వివాదానికి కేంద్రబిందువుగా మారింది. తరతరాలుగా వస్తున్న ఆచారం పేరుతో జంతువులను క్రూరంగా బలి ఇస్తున్నారంటూ జంతు సంరక్షణ ప్రతినిధులు రంగంలోకి దిగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాయికల్‌లో నిర్వహించే భీమన్న జాతర స్థానికులకు అత్యంత వైభవమైన వేడుక. ఈ వేడుకల్లో భాగంగా పోతరాజులచే గావు పట్టించడం ఒక పురాతన సంప్రదాయం. ఈ సారి కూడా జాతరలో భాగంగా పోతరాజులు సుమారు 50 మేకలను పళ్లతో కొరికి, గావు పట్టి బలి ఇచ్చారు. భక్తి పారవశ్యంలో భక్తులు ఈ వేడుకను జరుపుకున్నప్పటికీ, ఈ దృశ్యాలు జంతు ప్రేమికులను కలచివేస్తున్నాయి.

చట్టం విరుద్ధమంటున్న యానిమల్ వెల్ఫేర్

ఈ ఘటనపై జంతు సంరక్షణ కార్యకర్త రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తి పేరుతో జంతువులను ఇలా క్రూరంగా హింసించి చంపడం జంతు సంరక్షణ చట్టం ప్రకారం నేరమని ఆమె స్పష్టం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 మేకలను నోటితో కొరికి చంపడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి మూఢనమ్మకాలు, క్రూరమైన పద్ధతులు ఆధునిక సమాజంలో సరికావు అని ఆమె అన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

సంప్రదాయం Vs చట్టం

గ్రామస్థులు మాత్రం ఇది తమ ఆచారమని, దేవుని మొక్కు తీర్చుకోవడంలో భాగంగానే ఇలా చేస్తున్నామని చెబుతుండగా.. చట్టం ముందు అందరూ సమానమేనని యాక్టివిస్టులు వాదిస్తున్నారు. ఈ ఘటన ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Follow Us