Telangana: దేవుడు పూని పొలంలో గొయ్యి తవ్వమన్నాడు.. నిధి ఉందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే

ఆరోగ్యం బాగుచేయాలని తనను ఆశ్రయించిన దంపతులను క్షుద్రపూజల పేరుతో భయపెట్టి ఏకంగా రూ.3 కోట్లు కొట్టేశాడో నకిలీ దొంగబాబా. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ స్టోరీలో ఓసారి చూసేయండి మరి. ఇది తెలుసుకోండి

Telangana: దేవుడు పూని పొలంలో గొయ్యి తవ్వమన్నాడు.. నిధి ఉందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే
Representative Image

Updated on: Dec 03, 2025 | 1:07 PM

వనపర్తి జిల్లా పెబ్బేరులో ఉంటున్న వెంకటయ్య, పద్మ దంపతులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కర్నూల్ జిల్లాలోని బైచిగేరి గ్రామానికి చెందిన దుర్గాసింగ్‌కు దేవుడు వస్తాడని, అక్కడికి వెళ్తే ఆరోగ్యం కుదుట పడుతుందని ఎవరో చెబితే విని కొన్ని రోజుల కిందట దంపతులు అక్కడికి వెళ్లారు. దీన్ని ఆసరాగా చేసుకున్న దుర్గాసింగ్ వారికి కట్టుకథలు చెప్పారు. మీ పొలంలో నిధి ఉందని, అది తీసేంత వరకూ మీకు, మీ పిల్లలకు ప్రాణహాని ఉంటుందని భయపెట్టాడు. ఆ నిధి తీస్తానని చెప్పి వారి నుంచి మొదట రూ.80 లక్షలు కాజేశాడు. ఓ రోజు రాత్రి బాధితుల స్వగ్రామమైన ఉండవల్లి శివారులోని వారి పొలంలో క్షుద్రపూజలు చేశాడు. అనంతరం ఇక్కడ అమ్మవారి విగ్రహం బయటపడిందని చెప్పి మూడడుగుల ఎత్తున్న విగ్రహాన్ని దంపతులకు చూపించాడు. ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ప్రాణహాని ఉంటుందని, అమ్మేస్తే రూ.కోట్లు వస్తాయని నమ్మబలికాడు. అమ్మవారి విగ్రహం కొనుగోలుకు విదేశాల నుంచి కొందరు ఢిల్లీకి వచ్చారని చెప్పి, ఐదు సార్లు బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లాడు.

బాధితుల నుంచి సుమారు రూ.3 కోట్లు వసూలు చేశాడు. చివరికి మోసపోయామని గ్రహించిన దంపతులు తమ డబ్బు తిరిగివ్వాలని దుర్గాసింగ్‌ను కోరారు. దాంతో అతడు బెదిరింపులకు దిగాడు. గ్రామంలోకి అడుగుపెడితే చంపేస్తామని దుర్గాసింగ్‌తో పాటు ముకుంద అనే వ్యక్తి బాధితులను బెదిరించారు. గత నెల ఆదోనికి వచ్చి డీఎస్పీతో పాటు తాలూకా పోలీసు సీఐకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు అని దంపతులు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వద్ద బోరున విలపించారు. ఎమ్మెల్యే ఆదోని డీఎస్పీతో మాట్లాడగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని డీఎస్పీ అన్నారు.