Telangana: ఇదేంది సారూ..! తన వాహనానికి పాడి గేదెలు అడ్డొచ్చాయని కాపులాదారుడికి కలెక్టర్ ఫైన్

ములుగు జిల్లాలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య తీరు చర్చనీయాంశంగా మారింది. సాధారణ పశువుల కాపరిపై చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Telangana: ఇదేంది సారూ..! తన వాహనానికి పాడి గేదెలు అడ్డొచ్చాయని కాపులాదారుడికి కలెక్టర్ ఫైన్
Farmer Fined

Updated on: Jan 04, 2023 | 11:59 AM

ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అనవసరంగా ఆవేశపడి వివాదంలో చిక్కుకున్నారు. తన వాహనానికి పాడి గేదెలు అడ్డురావడంతో ఫైర్‌ అయిన ములుగు కలెక్టర్‌ పశువుల కాపలాదారుడిపై కన్నెర్రజేశారు. తక్షణమే అతడిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అదే ఇష్యూ ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతోంది. ఆందోళనలకు తెరతీస్తోంది. గంపోని గూడెంకి చెందిన బోయిని యాకయ్య, బోరు నర్సాపురానికి చెందిన రైతుల పాడి గేదెలను అడవికి తోలుతుండగా అటువైపే వెళుతోన్న ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య వాహనానికి పశువులు అడ్డు వచ్చాయి. ఎంత సేపు హారన్‌ కొట్టినా పశువులు అడ్డుతొలగకపోవడంతో కలెక్టర్‌కి కోపమొచ్చింది. పశువుల వెనుకే ఫోన్‌లో మాట్లాడుతూ వెళుతోన్న యాకయ్యపై ఫైర్‌ అయిన కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య… యాకయ్య సెల్‌ఫోన్‌ తీసేసుకున్నారు. అంతటితో ఆగకుండా అతడిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు హుకూం జారీచేశారు.

అధికారులు అత్యుత్సాహంతో కలెక్టర్‌ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించారు. హరితహారంలో నాటిన మొక్కలను పశువులు నాశనం చేస్తున్నాయంటూ పశువుల కాపలాదారు యాకయ్యకి రూ.7,500 జరిమానా వడ్డించారు. పైగా కట్టకపోతే కేసు నమోదు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగకుండా నల్లా కనెక్షన్‌కు సీల్‌ వేశారు.

సోమవారం జరిగిన ఈ ఘటనపై మంగళవారం ఎంపీడీవో కార్యాలయం దగ్గర ధర్నాకి దిగారు పశువుల యజమానులు, కాపలాదారులు. దీంతో చిన్న విషయం చినికి చినికి గాలివానలా మారింది. ఇదే ఇప్పుడు జిల్లా అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కలెక్టర్‌ వ్యవహారాన్ని విమర్శలపాల్జేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..