తెలంగాణలో అడవి బిడ్డల 50 ఏళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. అటవీ భూముల్లో సాగు కోసం నిత్యం యుద్దం చేయాల్సిన పరిస్థితుల నుండి తెలంగాణ ఆదివాసులకు విముక్తి కలగబోతోంది. తెలంగాణ ప్రభుత్వం పోడు భూములకు ఇవాళ హక్కు పత్రాలు ఇవ్వబోతుండటంతో అడవి బిడ్డలు పులకించిపోతున్నారు. ఆ మహా మహాకార్యక్రమానికి ఆసిఫాబాద్ జిల్లాలో అంకురార్పణ జరగబోతోంది. ఇవాళ కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా వేదికగా సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండడంతో ఆదివాసీల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పోడు భూములకు పట్టాలు ఇవ్వటంతోపాటు వాటికి రైతుబంధు కూడా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో ఆదివాసీల్లో ఆనందం మరింత రెట్టింపవుతోంది. ఈ లెక్కన చూస్తే తెలంగాణ వ్యాప్తంగా లక్షా 47 వేల ఎకరాలకు పోడు పట్టాలతోపాటు రైతు బంద్ పథకం సైతం అమలు కానుంది. ఇక.. తెలంగాణలో 12 లక్షల ఎకరాల పోడు భూమికి గాను 4,300 గూడేలకు సంబంధించిన 2,450 గ్రామాల నుంచి 3,40,000 దరఖాస్తులు తీసుకున్న సర్కార్ ఏడాదికి పైగా సర్వే నిర్వహించింది.
ఆ నివేదికతో తెలంగాణలో 1 లక్ష 47 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 37 వేల ఎకరాలకు పోడు పట్టాలు అందించనుంది. వాస్తవానికి.. వానకాలం సీజన్ వచ్చిదంటే చాలు అడవి భూముల్లో ఆదివాసీలకు అటవీశాఖకు మధ్య ఓ యుద్ధవాతవరణమే కనిపించేది. పోడు సాగు చేసుకునేందుకు హక్కు లేదంటూ అటవీశాఖ అడ్డుకోవడంతో ఆదివాసీ పోడు రైతులు తిరగబడక తప్పని పరిస్థితి ఉండేది. అడవుల జిల్లా ఆదిలాబాద్ నుండి భద్రాద్రి కొత్తగూడెం వరకు పోడు భూముల్లో సాగు ఒక నిత్య యుద్దమే. ఇప్పుడు.. ఆ కష్టాలకు చెక్ పెడుతూ పోడు గోడును దూరం చేస్తోంది కేసీఆర్ సర్కార్. పోడు పట్టాల పంపిణి అనంతరం ఇక మీదట పోడు సమస్య.. అటవీశాఖ, ఆదివాసీలకు మధ్య గొడవలు ఉండవని.. కొత్త పోడు కొడితే మాత్రం కఠిన చర్యలు తప్పని హెచ్చరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..