
హైదరాబాద్, నవంబర్ 23: నవంబర్ 20తో కార్తీకమాసం పూర్తయిన నేపథ్యంలో చికెన్, కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. కార్తీక మాసం పూర్తయ్యాక వచ్చిన తొలి ఆదివారం కావడంతో ఈ రోజు చికెన్ షాపుల ముందు మాంసం ప్రియులు బారులు తీరి కనిపించారు. దీంతో షాపుల్లో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. డిమాండ్ పెరగడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయ్. గత మూడు వారాలుగా చికెన్ ధరలు స్థిరంగా కొనసాగాయి. కానీ ఈ రోజు కిలో చికెన్ (స్కిన్ లేకుండా) దాదాపు రూ. 230 పలుకుతుంది. ఐతే ఆన్ లైన్ రేట్ రూ.220, పేపర్ ధర రూ. 207గా ఉంది. ఈ నెలాఖరుకు కిలో చికెన్ రూ.280 వరకూ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ కేజీ రూ.230 నుంచి రూ.250 మధ్య పలుకుతుంది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాల్లో రూ.225 నుంచి రూ.250 మధ్యలో లభిస్తోంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ఇక మటన్ ధరలు ఎప్పటి మాదిరిగానే ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం మటన్ కిలో ధర రూ.800 నుంచి రూ.900 వరకు ఉంది.
ఇక కోడి గుడ్డు విషయానికొస్తే ఒక్కొక్కటి ధర రూ. 7.50 నుంచి రూ.8 వరకు పలుకుతుంది. కూరగాయల ధరలు అధికంగా ఉన్నప్పుడు కోడిగుడ్లతో సరిపెట్టుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇవి కూడా ఇప్పుడు భారం మారాయి. వచ్చే రెండు, మూడు వారాల్లో డజను గుడ్లు సెంచరీ కొట్టే అవకాశం కూడా ఉంది. ప్రతీ ఏడాదిలాగే కార్తీక మాసం ముగిసి నవంబర్ 21 నుంచి మార్గశిర మాసం మొదలుకావడంతో కోడి గుడ్డు, చికెన్ ధరలు పెరుగుతున్నాయి.