
రోడ్డుపై గుమగుమలాడే వంటలు.. పంక్తులు తీరి కూర్చున్న జనం.. దారిన పోయే వారందరిని ఆప్యాయంగా పిలిచి వడ్డిస్తున్న వైనం. ఇదంతా చూస్తే ఇదేదో దసరా నవరాత్రి ఉత్సవాలో, గణేష్ నవరాత్రుల్లో పెట్టే అన్నదానాలో, లేక ఊరిలో జరిగిన పెద్ద పెళ్లి భోజనాలో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది ఏ పండుగో, శుభకార్యమో కాదు.. తమ న్యాయమైన హక్కుల కోసం చెన్నూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖ ఎదుట ‘బంగారు రుణాల బాధితులు’ చేపట్టిన వినూత్న నిరసన. తీరని అన్యాయంతో రోడ్డెక్కిన బాధితులు ఈ తీరున నిరసన చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా చెన్నూరు SBI బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి మోసపోయామంటూ గత కొంతకాలంగా ఆందోళన చెందుతున్న బాధితులు.. తాజాగా సోమవారం నిరసనను ఉధృతం చేశారు. బ్యాంకు అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన బాధితులంతా ఏకమై ‘బ్యాంకు ముందే వంటావార్పు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బ్యాంకు లోపల, బయట వంటలు వండుకుని అక్కడే కూర్చుని తింటూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
మా కష్టార్జితాన్ని బ్యాంకులో పెడితే మాకు దిక్కు లేకుండా పోయింది. అధికారులు స్పందించే వరకు మా పోరాటం ఆగదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వంటవార్పు చేపట్టారు. అన్నం వడ్డిస్తూనే.. ఎస్బీఐ బ్యాంకులో తమకు జరిగిన అన్యాయాన్ని, పడుతున్న ఇబ్బందులను దారినపోయే వారికి వివరించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సాగిన ఈ వినూత్న ఆందోళన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగింది?
గత ఆగష్టులో మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్- 2లో గోల్డ్‌లోన్ స్కాం బయటపడింది. బ్యాంక్ క్యాషియర్ నరిగే రవీందర్ బ్యాంక్‌లో తనఖా పెట్టిన 400 మంది గోల్డ్‌లోన్ ఖాతాదారుల బంగారాన్ని మాయం చేశాడు. ఈ కేసులో బ్యాంక్ మేనేజర్‌తో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలిసి ఈ ఘరానా మోసానికి పాల్పడినట్లు అప్పట్లోనే పోలీసులు తేల్చారు. బ్యాంకు లోని రూ.12.61 కోట్ల విలువైన 402 గోల్డ్‌లోన్ ఖాతాల ఆభరణాలు (25.17కిలోల బంగారం), రూ.1.10 కోట్లు నగదు గల్లంతైనట్లు గుర్తించిన బ్యాంకు రీజనల్ మేనేజర్ రితేశ్‌కుమార్ గుప్తా గతంలో ఫిర్యాదు చేశారు.
కేసు విచారణ చేపట్టిన పోలీసులు బంగారాన్ని సైతం రికవరీ చేశారు. కానీ ఆర్బీఐ నియమనిబందనల ప్రకారం కేసు పూర్తయ్యేంత వరకు బంగారం ఖాతాదారులకు ఇచ్చే అవకాశం లేదంటూ ఎస్బీఐ అదికారులు చెప్పడంతో ఆరోజు నుండి వరుస ఆందోళనలు, నిరసనలు చేస్తునే ఉన్నారు గోల్డ్ లోన్ బాధితులు. అయినా న్యాయం దక్కకపోవడంతో ఇలా బ్యాంక్ ముందే వంటవార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. తమ బంగారం తమకు ఇచ్చేందుకు నిరాకరిస్తే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామంటూ తెలిపారు గోల్డ్ లోన్ బాధితులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.