
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే వార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా ఆరు రైల్వే లైన్లను నిర్మించేందుకు కేంద్ర పచ్చజెండా ఊపింది. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని లోక్‌సభలో స్పష్టం చేశారు. డీపీఆర్ తయారుచేసేందుకు ఇప్పటికే సర్వే చేపడుతున్నామని, అనంతరం టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులపై మాల్కా్‌జ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ బదులిస్తూ. రాష్ట్రంలో ఆరు కొత్త రైల్వే లైన్లను నిర్మించనున్నట్లు చెప్పారు. కాచిగూడ-జగ్గయ్యపేట రైల్వే లైన్‌తో పాటు బోధన్-లాతూరు, గద్వాల-డొర్నకల్, వికారాబాద్-కృష్ణా, పటన్ చెర్వు-ఆదిలాబాద్ రైల్వే లైన్లను కొత్తగా నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు.

ఇక 2022-23 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో కొత్తగా 18 రైల్వే లైన్లకు అనుమతి ఇచ్చామన్నారు. మొత్తం 57 లైన్లలో డీపీఆర్ సర్వే చేపట్టేందుకు అనుమతి మంజూరైందన్నారు. మొత్తం 5,665 కిలోమీటర్ల పొడవైన లైన్లను నిర్మించనున్నట్లు అశ్విన వైష్ణవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యమై డీపీఆర్ సిద్దం చేస్తామని వెల్లడించారు.

అటు తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం 2343 హెక్టార్ల భూమి అవసరమని, కానీ భూసేకరణ ప్రక్రియలో ఆలస్యం జరుగుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. భూసేకరణ ప్రక్రియ వల్ల నాలుగు ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 1580 హెక్టార్లు సేకరించినట్లు చెప్పుకొచ్చారు.

కాచిగూడ-జగ్గయ్యపేట రైల్వే లైన్ 250 కిలోమీటర్లు ఉండనుండగా.. పటాన్ చెర్వు-ఆదిలాబాద్ లైన్ 320 కి.మీ ఉంటుంది. ఇక వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ 122 కిలోమీటర్ల పొడవు ఉండనుండగా..గద్వాల్-డోర్నకల్ కల్వకుర్తి మీదుగా వెళ్లనుంది. ఈ రైల్వే లైన్ 316 కి.మీ, బోధన్-లాతూర్ లైన్ 128 కిలోమీటర్లు ఉంటుంది. ఇక అక్కన్నపేట బై పాస్ 128 కి.మీ ఉంటుందని అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో పేర్కొన్నారు.