Munugode Bypoll: మునుగోడు విన్నర్ ఎవరు.. ఉదయం 9 గంటలకల్లా తొలి ఫలితం.. ఫస్ట్ అక్కడి ఓట్లు లెక్కింపు

మునుగోడు మొనగాడు ఎవరో ఆదివారం తేలిపోనుంది. ఈ ఉపఎన్నిక ఫలితం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Munugode Bypoll: మునుగోడు విన్నర్ ఎవరు.. ఉదయం 9 గంటలకల్లా తొలి ఫలితం.. ఫస్ట్ అక్కడి ఓట్లు లెక్కింపు
Munugode Bypoll

Updated on: Nov 05, 2022 | 9:52 AM

మునుగోడు విన్నర్ ఎవరు..? ఇప్పుడు అందరిలో ఇదే టెన్షన్‌..! మరీ ఉపపోరులో గెలిచేది ఎవరు..? ఓడేదెవరు..? ఓట్ల లెక్కింపుకు కొద్ది గంటల సమయం ఉండటంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా…ఫలితం ఎలా ఉండబోతోంది..? ఎవరు గెలుస్తారనే చర్చ నడుస్తోంది. ప్రధానపార్టీల నేతలు మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు గెలుపు తమదేనని ఢంకా బజాయించి చెబుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ ఈసారి రికార్డుస్థాయిలో నమోదైంది. మొదట 92 శాతం పోలింగ్‌ నమోదైందని అధికారులు ప్రకటించారు. ఐతే కొన్నిచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం వంటి కారణాలతో గురువారం రాత్రి పొద్దుపోయేవరకు సాగిన పోలింగ్‌ ప్రకారం మొత్తం 93.13 శాతం నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 2018 ఎన్నికల్లో 91.3 శాతం పోలింగ్‌ నమోదవ్వగా..ప్రస్తుతం1.8 పోలింగ్‌శాతం పెరిగింది.

నల్లగొండ టౌన్‌లోని అర్జాల‌బావి దగ్గర వేర్ హౌసింగ్ గోడౌన్‌లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ప్రక్రియలో 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు సూప‌ర్‌వైజ‌ర్, అసిస్టెంట్ సూప‌ర్ వైజ‌ర్, మైక్రో అబ్జర్వర్‌ల‌ను నియ‌మించారు. మొత్తం 298 పోలింగ్‌ బూత్‌ల్లోని ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను 15 రౌండ్లలలో లెక్కిస్తారు. ఉదయం 9 గంటలకల్లా తొలి ఫలితం వెల్లడయ్యే ఛాన్స్‌ ఉంది. చివరి ఫలితం మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చే అవకాశం ఉంది. మునుగోడులో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వ‌చ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంల‌లో న‌మోదైన ఓట్లను లెక్కిస్తారు. మొదట చౌటుప్పల్‌ మండలంలోని ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాల ఈవీఎంలను టేబుళ్ల వద్దకు తరలిస్తారు.

ఇప్పటికే ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బంది, అధికారులకు మూడు దఫాలుగా అధికారులు శిక్షణ ఇచ్చారు. ఇక కౌంటింగ్‌ కేంద్రం దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర సీఆర్పీఎఫ్‌ బలగాలతో, సీసీ కెమెరాల పర్యవేక్షణలో 24 గంటల పాటు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

మరిన్ని మునుగోడు వార్తల కోసం

Follow Us