
ఇంట్లో తల్లి మందలించిందని కోపంగా బయటకు వెళ్లిన 14 ఏళ్ల బాలుడు సైకిల్‌పై 50 కిలోమీటర్లు ప్రయాణించాడు. నిజామాబాద్ నుంచి కామారెడ్డికి అర్ధరాత్రికి చేరుకున్నాడు. ఆపరేషన్ కవచ్‌లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు బాలుడితో ప్రేమగా మాట్లాడి వివరాలు సేకరించి బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు తల్లి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎవరికీ చెప్పకుండా బుధవారం మధ్యాహ్నం తన సైకిల్‌పై నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు బయలుదేరాడు. దాదాపు 50 కిలోమీటర్ల ప్రయాణం చేసి అర్ధరాత్రి 11:00 గంటల సమయంలో టేక్రియాల్ జంక్షన్ వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో అక్కడ ఆపరేషన్ కవచ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న దేవునిపల్లి పోలీసులు చీకట్లో ఒంటరిగా సైకిల్‌పై వెళ్తున్న బాలుడిని గమనించారు. అనుమానం వచ్చి ఆపి, బాలుడిని ప్రేమతో పలకరించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అప్పటికే కుమారుడి ఆచూకీ తెలియక ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు బుధవారం తెల్లవారుజామున 3:00 గంటలకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డను కాపాడిన పోలీసులకు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. ఆపరేషన్ కవాచ్ ముఖ్య ఉద్దేశ్యం నేరాల నియంత్రణతో పాటు, ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమేనని పునరుద్ఘాటించారు. కామారెడ్డి జిల్లాలో ప్రజల భద్రత కోసం తాము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ కవాచ్ నేడు ఆపదలో ఉన్న ఒక బాలుడిని సురక్షితంగా రక్షించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ ఆ బాలుడు ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు, తమ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి, మానవీయ కోణంలో స్పందించి ఆ బాలుడి భవిష్యత్తును కాపాడటం అభినందనీయమని కొనియాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి బాలుడిని కాపాడిన దేవునిపల్లి పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
Also Read: ఈ ఒక్క పని చేస్తే పిండి పురుగు అంతా మాడి మసైపోద్ది అంతే..