
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమల్లో కీలక మార్పులు తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చెక్కుల రూపంలో అందిస్తున్న ఆర్థిక సాయాన్ని ఇకపై డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేసే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుతో లబ్ధిదారులు త్వరగా సాయం పొందడమే కాకుండా, పరిపాలనా ప్రక్రియ కూడా సులభతరం కానుంది. ప్రస్తుతం అర్హులైన ప్రతి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి లేదా షాదీ ముబారక్ కింద రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ మొత్తాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే అవసరమైన ధృవీకరణ ప్రక్రియ పూర్తైన వెంటనే సొమ్ము నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో చెక్కుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.
ఇప్పటి విధానం ప్రకారం.. వివాహం పూర్తైన తర్వాత లబ్ధిదారులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఎమ్మార్వో (మండల రెవెన్యూ) కార్యాలయంలో దరఖాస్తు పరిశీలన జరుగుతుంది. తర్వాత ఆర్డీవో స్థాయిలో వెరిఫికేషన్ పూర్తవుతుంది. అనంతరం సంబంధిత ప్రజాప్రతినిధి ఆమోదం వంటి పరిపాలనా ప్రక్రియలు పూర్తయిన తర్వాత మాత్రమే చెక్కు జారీ అవుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో అనేక దశలు ఉండటంతో ఆలస్యం తప్పడం లేదు.
ఎమ్మార్వోలు, ఆర్డీవోలపై ఇతర ప్రభుత్వ బాధ్యతలు అధికంగా ఉండటంతో కల్యాణలక్ష్మి దరఖాస్తుల పరిశీలన ఆలస్యమవుతోందని తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలు, జనగణన, ఓటర్ల జాబితాల సవరణ వంటి అదనపు పనుల కారణంగా దరఖాస్తుల వెరిఫికేషన్‌కు తగిన సమయం కేటాయించలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి.
కొంతమంది దరఖాస్తుదారులు వివాహం జరిగిన ఏడాది తర్వాత కూడా సాయం అందక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల దరఖాస్తులు ఎమ్మార్వో కార్యాలయం దాటకుండానే నెలల తరబడి నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని దరఖాస్తులు ఆర్డీవో స్థాయిలో పెండింగ్‌లో ఉండటంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
చెక్కుల ద్వారా సాయం అందించే విధానంలో మరో సమస్య కూడా వెలుగుచూస్తోంది. ఆలస్యంగా చెక్కులు పంపిణీ కావడంతో కొన్ని సందర్భాల్లో వాటి చెల్లుబాటు గడువు ముగిసిపోతోందని తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులు మళ్లీ కొత్త ప్రక్రియను పూర్తి చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చెక్కుల విధానాన్ని పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
డీబీటీతో పాటు దరఖాస్తుల పరిశీలన, ఆమోద ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక డిజిటల్ పోర్టల్‌ను రూపొందించే అంశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకే వేదికపై దరఖాస్తు నమోదు, వెరిఫికేషన్, ఆమోదం, నిధుల విడుదల వంటి ప్రక్రియలను అనుసంధానించడం ద్వారా పారదర్శకత పెరగడంతో పాటు జాప్యం కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
డీబీటీ అమలైతే లబ్ధిదారులకు మాత్రమే కాకుండా ప్రభుత్వానికీ అనేక ప్రయోజనాలు ఉంటాయి. చెక్కుల ముద్రణ, రవాణా, నిల్వ, పంపిణీ, ఆడిటింగ్ వంటి ప్రక్రియలపై అయ్యే వ్యయం తగ్గుతుంది. అలాగే మానవ తప్పిదాలు తగ్గి, నిధుల బదిలీ మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన తర్వాత కల్యాణలక్ష్మి పథకం పేరును “కల్యాణమస్తు”గా మారుస్తామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు అధికారికంగా పేరుమార్పు అమల్లోకి రాలేదు. ప్రస్తుతం పథకం పాత పేరుతోనే కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..