ఉదయం ఉత్తమ ఉద్యోగి అవార్డు.. రాత్రికే గుండెపోటుతో 108 ఉద్యోగి మృతి..!

ఉదయం ఉత్తమ ఉద్యోగి అవార్డుతో సత్కారం.. రాత్రికే గుండెపోటుతో మృతి. జోగుళాంబ గద్వాల జిల్లా చెనుగోనిపల్లికి చెందిన 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ జహంగీర్‌ (27) ఐదేళ్లుగా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతూ సేవలందించాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న కొన్ని గంటల్లోనే గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది..

ఉదయం ఉత్తమ ఉద్యోగి అవార్డు.. రాత్రికే గుండెపోటుతో 108 ఉద్యోగి మృతి..!
108 Ambulance Employee Death

Updated on: Aug 17, 2026 | 12:46 PM

గద్వాల, ఆగస్ట్‌ 17: విధి నిర్వహణలో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఓ 108 అంబులెన్స్ ఉద్యోగి.. ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న కొన్ని గంటల్లోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా చెనుగోనిపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి సమీపంలోని చెనుగోనిపల్లికి చెందిన జహంగీర్‌ (27) అలంపూర్‌లో 108 అంబులెన్స్‌లో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. గత ఐదేళ్లుగా అత్యవసర సమయాల్లో బాధితులకు వైద్య సేవలు అందిస్తూ పలువురి ప్రాణాలను కాపాడాడు. తన సేవలతో అధికారుల నుంచి, ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా జహంగీర్‌ ఉత్తమ ఉద్యోగి అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందుకున్నాడు. ఉదయం ఎంతో ఆనందంగా అవార్డు అందుకున్న అతడు.. అదే రోజు రాత్రి అనూహ్యంగా గుండెపోటుకు గురయ్యాడు.

ఇవి కూడా చదవండి

రాత్రి సుమారు 2 గంటల సమయంలో జహంగీర్‌కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. ఉదయం ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్న వ్యక్తి.. కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎన్నో అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రులకు తరలించి పలువురి ప్రాణాలను కాపాడిన జహంగీర్‌.. చివరకు తన ప్రాణాలను కాపాడుకోలేకపోయాడంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సేవాభావంతో పనిచేసిన యువ ఉద్యోగి ఇలా అకస్మాత్తుగా మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us