Hyderabad: కంటోన్మెంట్ ఆయుధాల చోరీ కేసులో ట్విస్ట్.. బయటపడుతున్న బంగ్లా లింకులు!
కంటోన్మెంట్ ఆయుధాల చోరీ కేసులో మాజీ హవిల్దార్ మల్లేష్ కీలక సమాచారాన్ని వెల్లడించాడు. మొదట దోపిడీలకు ప్లాన్ చేసినా, స్నేహితులు నిరాకరించడంతో బంగ్లాదేశ్‌కు ఆయుధాలు విక్రయించేందుకు ప్రయత్నించాడు. బీర్బల్‌షా, ఓబీలతో ఒప్పందం చేసుకొని ఒక తుపాకీ అప్పగించాడు. ఈ చోరీకి సైనికులు శేషులు, ప్రవీణ్, వినోద్ సహకరించారు. ఆర్థిక సమస్యలు, కక్షే చోరీకి కారణమని పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ నుంచి ఆయుధాల చోరీ కేసులో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ హవిల్దార్ మల్లేశ్‌ను 10 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించగా.. ఆయుధాల చోరీ, వాటిని విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు, ఈ వ్యవహారంలో సహకరించిన వ్యక్తులపై సమాచారం రాబట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆయుధాలను చోరీ చేసిన తర్వాత మల్లేశ్ కోల్‌కతాకు చెందిన బీర్బల్‌షాను సంప్రదించినట్లు దర్యాప్తులో తేలింది. బీర్బల్‌షా ద్వారా బంగ్లాదేశ్‌కు చెందిన అవల్‌దెయ్ అలియాస్ ఓబీతో ఆయుధాల విక్రయంపై సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఒక తుపాకీని ఓబీకి ఇచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. నాలుగు ఏకే-47 రైఫిళ్లకు రూ.5 లక్షలు, పిస్టల్స్‌కు రూ.3 లక్షలు చెల్లించాలని బీర్బల్‌షా కోరినట్లు సమాచారం. ఈ కేసులో కీలకంగా మారిన బీర్బల్‌షా, ఓబీ కోసం పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
అయితే మొదట మల్లేశ్ ఆయుధాలను ఉపయోగించి బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు పాల్పడాలని భావించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని తన బాల్యమిత్రులు నిరంజన్, మల్లికార్జున్‌లతో పంచుకున్నప్పటికీ.. వారు అంగీకరించకపోవడంతో ఆయుధాలను విక్రయించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
చోరీకి ముందు మల్లేశ్ మద్రాస్ రెజిమెంట్‌లో పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ పనిచేస్తున్న శేషులు, ప్రవీణ్, వినోద్ అనే జవాన్ల సహకారం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆర్మరీలోని ఆయుధాలను బయటకు తరలించేందుకు శేషులు, వినోద్‌లతో సంప్రదింపులు జరిపి.. వినోద్‌కు శేషులు ద్వారా రూ.లక్ష అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
చోరీకి వారం ముందే వినోద్ సీసీ కెమెరాలను పనిచేయకుండా చేసినట్లు దర్యాప్తులో తేలింది. చోరీ జరిగిన రోజు మల్లేశ్ కెమెరాలపై ఫోమ్ చల్లినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ప్రవీణ్, శేషులు రెజిమెంట్ ప్రాంగణంలోని విద్యుత్ లైట్లను నిలిపివేశారని వెల్లడించారు. దాదాపు గంటన్నరపాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తరలించే సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిని వారు పక్కదారి పట్టించినట్లు పోలీసులు చెబుతున్నారు.
చోరీ చేసిన ఆయుధాలను మల్లేశ్ ఇంటికి తరలించడంలోనూ ఈ ముగ్గురు సహకరించినట్లు విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది.
2010లో సైన్యంలో చేరిన మల్లేశ్.. వివిధ కంటోన్మెంట్లలో ఆయుధాగారాల సమీపంలోనే విధులు నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు ఓ ఉన్నతాధికారిపై ఉన్న కక్ష కారణంగా ఆయుధాల చోరీకి పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. 2022లో కోల్‌కతాలోని బారక్‌పుర్ కంటోన్మెంట్‌లో పనిచేసే సమయంలో ఓ ఉన్నతాధికారితో దురుసుగా ప్రవర్తించడంతో సస్పెన్షన్‌కు గురైనట్లు తెలిపారు. అక్కడే బీర్బల్‌షాతో పరిచయం ఏర్పడిందని, అనంతరం 2023లో తిరిగి బారక్‌పుర్‌లో విధుల్లో చేరినట్లు వెల్లడించారు. గతేడాది జూన్‌లో మల్లేశ్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌కు బదిలీపై వచ్చాడు. ప్రస్తుతం చోరీ చేసిన ఆయుధాల గమ్యం, అంతర్జాతీయ సంబంధాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
