
నల్లమల అడవుల్లో పెద్దపులి గంభీరంగా దర్శనమివ్వడం వన్యప్రాణి ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని ఫర్హాబాద్ సమీపంలో అటవీ శాఖ జిల్లా అధికారి (DFO) రేవంత్ చంద్ర రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ అరుదైన దృశ్యం తారసపడింది.
తమ వాహనానికి ఎదురుగా పెద్దపులి స్వేచ్ఛగా, ప్రశాంతంగా సంచరిస్తుండటాన్ని చూసి డీఎఫ్‌ఓ ఆనందం వ్యక్తం చేశారు. అటవీశాఖ నిరంతరం చేపడుతున్న సంరక్షణ చర్యలు, వేటగాళ్ల నిరోధం, నీటి వసతుల కల్పన వంటి కార్యక్రమాల వల్లే నల్లమలలో పెద్దపులుల సంఖ్య పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిణామం అటవీ పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉందనడానికి నిదర్శనమని అధికారులు భావిస్తున్నారు. పర్యాటకులు, స్థానికులు అటవీ నిబంధనలను పాటిస్తూ, వన్యప్రాణుల రక్షణలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా వారు కోరారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంచారం పెరగడం పట్ల పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయిన నల్లమల (NSTR) అడవుల్లోకి దశాబ్దాల తర్వాత ఇండియన్ గౌర్ (అడవి దున్న) తిరిగి రాబోతోంది. రెండేళ్ల క్రితం వలస వచ్చిన ఒక అడవి దున్న ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటంతో, మధ్యప్రదేశ్‌లోని సత్పురా టైగర్ రిజర్వ్ నుండి సుమారు 100 గౌర్లను తీసుకురావాలని అటవీశాఖ నిర్ణయించింది. తొలి విడతగా 30 దున్నలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విజ్ఞేష్ అప్పావ్ తెలిపారు. వీటి రాకతో పులులకు సహజసిద్ధమైన ఆహారం లభించి, వాటి సంతతి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, త్వరలోనే నల్లమలకు ఏనుగులను కూడా తీసుకురావడానికి అటవీశాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టు నల్లమల జీవవైవిధ్యాన్ని మరింత సుసంపన్నం చేయనుంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..