Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. జోరందుకున్న రుతుపవనాలు! మళ్లీ వర్షాల సందడి

బంగాళాఖాతంలో ఈ నెల 23, 24 తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది..

Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. జోరందుకున్న రుతుపవనాలు! మళ్లీ వర్షాల సందడి
Telangana Rains

Updated on: Jul 21, 2026 | 6:26 AM

హైదరాబాద్‌, జూలై 21: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ నెల 23, 24 తేదీల్లో ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు ఆనుకుని మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో తెలంగాణతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణలో మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హనుమకొండ, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇక రాష్ట్రంలో గత 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యు)లో అత్యధికంగా 10.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూరులో 8.2 సెంటీమీటర్లు, నిజామాబాద్‌ గ్రామీణ మండలం మల్కాపూర్‌లో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో చెరువులు, వాగులు నీటితో కళకళలాడుతుండగా, రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల పాటు వర్షాల ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు వాతావరణ శాఖ సూచనలను పాటించాలని అధికారులు సూచించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us