రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్..

ATA Celebrations 2025: రవీంద్ర భారతిలో ఆటా సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రవాస తెలుగు సంఘమైన ఆట పాత్రను కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంస్కృతి, భాషా పరిరక్షణలో ఆటా విశేష కృషి చేస్తోందన్నారు. తెలుగు మూలాలను మర్చిపోవద్దని పిలుపునిచ్చారు.

రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్..
Ata Celebrations 2025

Updated on: Dec 28, 2025 | 11:42 AM

తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయడంలో ప్రవాస తెలుగు సంఘాల పాత్ర వెలకట్టలేనిదని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు. శనివారం రవీంద్ర భారతి వేదికగా జరిగిన అమెరికా తెలుగు సంఘం సెలబ్రేషన్స్ – 2025 గ్రాండ్ ఫినాలే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా తమ మూలాలను, మాతృభాషను మర్చిపోవద్దని గవర్నర్ పిలుపునిచ్చారు. విదేశాల్లో స్థిరపడినా భారతీయ వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో ఆటా చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని అన్నారు.

తెలుగు సినీ పరిశ్రమకు దశాబ్దాల కాలం పాటు అద్భుతమైన చిత్రాలను అందించిన ప్రముఖ దర్శక దిగ్గజం ఎ.కోదండరాంరెడ్డిని ఆటా జీవన సాఫల్య పురస్కారంతో గవర్నర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రామచందర్రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు పటేల్ రమేశ్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొని ఆటా సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా నాయకత్వంలో జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ‘ఎక్సలెన్స్ అవార్డులు’ అందజేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు, శాస్త్రీయ నృత్యాలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి.

అమెరికా తెలుగు సంఘం అనేది 1990లో స్థాపించారు. దీని ప్రధాన ఉద్దేశం ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారిని ఏకం చేయడం, తెలుగు సంస్కృతిని ప్రోత్సహించడం. కేవలం సాంస్కృతిక వేడుకలే కాకుండా ఆటా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికాలో పుట్టి పెరుగుతున్న తెలుగు పిల్లల కోసం తెలుగు బడి వంటి కార్యక్రమాల ద్వారా భాషా పరిరక్షణకు ఆటా పెద్దపీట వేస్తోంది. ప్రతి రెండు ఏళ్లకొకసారి అమెరికాలో నిర్వహించే ఆటా కన్వెన్షన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి దృష్టిని ఆకర్షిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..