అదొక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం.. అక్కడున్న అధికారులు, వస్తూ పోయే వారితో.. కార్యాలయం బిజీబిజీగా ఉంది. ఈ తరుణంలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ మొదలైంది. కట్ చేస్తే ఓ మహిళా ఉద్యోగి.. మరో ఉద్యోగిపై కత్తితో దాడి చేసింది. దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది.. ఈ షాకింగ్ ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగింది. వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)పై మండల వ్యవసాయాధికారిణి (ఏవో) కత్తితో దాడి చేసింది. ఉద్యోగులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018 నుంచి ఆత్మకూరు (ఎం) మండల అగ్రికల్చర్ ఆఫీసర్‌గా ఎన్.శిల్ప పనిచేస్తోంది.. ఇదే మండలం పల్లెపహాడ్ వ్యవసాయ విస్తరణాధికారిగా మనోజ్ విధులు నిర్వహిస్తున్నాడు.. వీరిద్దరి మధ్య రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే, 2012లోనే మరో వ్యక్తితో శిల్పకు వివాహమైంది. రెండున్నరేళ్ల బాబు కూడా ఉన్నాడు. రెండేళ్లు శిల్ప భర్తకు దూరంగా ఉంటోంది. అయితే, ఓకే ఆఫీసులో శిల్ప, మనోజ్ పని చేస్తుండటంతో .. ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ మొదలైంది.
అయితే, శిల్పతో ప్రేమవ్యవహారం మనోజ్ తల్లిదండ్రులకు తెలియడంతో వారు అతడిని మందలించారు. దీంతో మనోజ్ ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఆయన మూడు నెలల క్రితం పల్లెపహాడ్ నుంచి యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటకు డిప్యూటేషన్‌పై వెళ్లాడు. ఆ తర్వాత రెండు నెలలు సెలవు పెట్టాడు. తిరిగి విధులకు హాజరయ్యేందుకు శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయానికి వచ్చాడు. అదే సమయంలో ఏవో శిల్ప తారసపడింది.. మనోజ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించింది.. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాదన మొదలైంది. చూస్తుంగానే వాగ్వాదం కాస్త ఘర్షణగా మారింది. ఇదే సమయంలో శిల్ప తన వెంట తెచ్చుకున్న కత్తితో మనోజ్‌పై దాడి చేసింది. మెడ, వీపు భాగాలపై రెండు పోట్లు పడటంతో మనోజ్‌కు గాయమై.. తీవ్ర రక్తస్రావమైంది. దీంతో తోటి ఉద్యోగులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
మనోజ్‌తో తాను రిలేషన్‌లో ఉన్నానని.. జూన్ 7, 2022లో రహస్య వివాహం కూడా చేసుకున్నామని శిల్ప చెప్పింది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి తనతోనే ఉండాలని మనోజ్ ఒత్తిడి చేశాడని.. వెంట బాబును తీసుకువస్తానని చెప్పగా వాడిని చంపేస్తానంటూ బెదిరించాడంటూ పోలీసులకు తెలిపింది. మూడు నెలల నుంచి తనను పట్టించుకోకుండా దూరంగా ఉంటున్నాడని.. కలెక్టరేట్‌లో మనోజే తనపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడని.. ఆత్మరక్షణ కోసం ఎదురు దాడి చేశానంటూ పేర్కొంది.
కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కత్తి ఎవరు తెచ్చారు? ఇద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చింది..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రూరల్ పోలీసులు తెలిపారు. ఏవో శిల్పపై హత్యాయత్నం కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..