Telangana: ఆటో ప్రయాణం ఉచితం అని ఎక్కించుకుంటారు.. ఆ తర్వాత అసలు స్కెచ్..
వృద్ధ ఒంటరి మహిళలే లక్ష్యంగా ఉచిత ఆటో ప్రయాణం పేరుతో నగల దోపిడీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఆదిలాబాద్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసి, 10 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వాంతి డ్రామాతో నగలు చోరీ చేసే ఈ ముఠా మహారాష్ట్ర, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 20కి పైగా నేరాలకు పాల్పడింది.

వృద్ధులు, ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసుల దోపిడీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. అమాయక మహిళలను మాటలతో నమ్మించి, కొత్త తరహా పద్ధతుల్లో వారి మెడలోని బంగారు నగలను కాజేస్తున్న ఈ ముఠాలో ముగ్గురు మహిళలు సహా మొత్తం ఎనిమిది మంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి చోరీలకు ఉపయోగించిన ఆటో, కారు, సెల్‌ఫోన్లతో పాటు దొంగిలించిన సుమారు 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రలోని వార్ధా ప్రాంతానికి చెందిన ఈ ముఠా సభ్యులు కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం కాకుండా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ముఖ్యంగా వృద్ధులు, ఒంటరిగా వెళ్తున్న మహిళలే వీరి టార్గెట్‌గా ఉండేవారని తెలిపారు.
ఈ ముఠా చోరీలకు ఎంచుకున్న పద్ధతి కూడా చాలా విచిత్రంగా ఉంటుందని పోలీసులు గుర్తించారు. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను గమనించి, వారి దగ్గరకు ఆటోతో వెళ్లేవారు. ఎక్కడికి వెళ్లాలని అడిగి, ఉచితంగానే ఆటోలో తీసుకెళ్తామని నమ్మించేవారు. మహిళలు ఆటో ఎక్కిన తర్వాత కొంతదూరం వెళ్లగానే ముఠా సభ్యుల్లో ఒకరు వాంతి వస్తున్నట్లు నటించేవారు. దీంతో ఆటోలో ఉన్న మహిళలు ఆందోళన చెందే సమయంలో, మిగతా సభ్యులు వారి దృష్టిని మళ్లించి మెడలోని బంగారు గొలుసులను చాకచక్యంగా దొంగిలించేవారు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయేవారు.
ఇదే కాకుండా శుభకార్యాలు, పెళ్లిళ్లలోనూ ఈ ముఠా సభ్యులు తమ చేతివాటాన్ని ప్రదర్శించేవారు. ముఖ్యంగా భోజనాల సమయంలో వరుసలో నిలబడిన మహిళలను గమనించి, వారి దృష్టి మరల్చి మెడలోని బంగారు నగలను కాజేసేవారు. జనసందోహం ఎక్కువగా ఉండటంతో బాధితులకు వెంటనే అనుమానం రాకుండా చోరీలకు పాల్పడేవారని పోలీసులు వెల్లడించారు.
ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా పద్ధతిని ఉపయోగిస్తూ పలు రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఇప్పటివరకు 20కి పైగా చోరీలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని ఎస్పీ తెలిపారు. ఈ ముఠా కదలికలు, చోరీల తీరుపై సమాచారం సేకరించిన ఆదిలాబాద్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఎనిమిది మందిని పట్టుకున్నారు. వీరిలో మహారాష్ట్రతో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.
నిందితుల నుంచి చోరీలకు ఉపయోగించిన ఆటో, కారు, సెల్‌ఫోన్లతో పాటు సుమారు 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతర్రాష్ట్ర స్థాయిలో పలు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠా అరెస్టుతో గొలుసు చోరీల కేసుల్లో కీలక పురోగతి సాధించినట్లయింది. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్ధులు అపరిచితులు ఇచ్చే ఉచిత ప్రయాణ ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
