అడవుల జిల్లా ఆదిలాబాద్ వన్య మృగాల సంచారంతో వణికిపోతోంది. కవ్వాల్ అభయారణ్యంలో ఇప్పటికే పులి ఎంట్రీ ఇచ్చిందన్న సమాచారం కలకలం రేపుతోంది. మరోవైపు మహారాష్ట్ర తడోబా, తిప్పేశ్వరం అభయారణ్యాల నుండి పులుల వలస.. ప్రాణహిత దాటోచ్చేందుకు సిద్దంగా ఉన్న మదపుటేనుగుల గుంపుతో ఉమ్మడి ఆదిలాబాద్ అటవీ ప్రాంత వాసుల భయం అమాంత పెరిగిపోతోంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల సమీప అటవీ ప్రాంతంలో పులి సంచారం టెన్షన్ పెడుతోంది. రెండు రోజులుగా బోథ్ మండలంలోని చింతల్ బోరి, చింతగూడ, నేరేడుపల్లె, రేండ్లపల్లిలో సంచరించిన పులి.. నేరేడుపల్లె సమీపంలో ఓ ఆవు పై దాడి చేసి హతమార్చింది.
అక్కడి నుండి మాయమైన పులి వజ్జర్ అడవుల్లోకి వెళ్లే అవకాశం ఉందని, అక్కడి నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే సమయంలో నిర్మల్ జిల్లా సారంగాపూర్ సెక్షన్ పరిధిలోని ఇప్పచెల్మ, పెండల్దరి అటవీ పరిదిలో పులి కనిపించందన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. అటవీ సమీప గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.
మరోవైపు సారంగాపూర్ మండలం రవీంద్రనగర్‌లో మేకల మందపై పులి దాడి చేసిన సంఘటన చోటుచేసుకోవడంతో అడవి బిడ్డలు భయంతో వణికిపోతున్నారు. ఈ దాడిలో రెండు మేకల మృతి చెందగా ఒక మేకకు గాయాలయ్యాయి. మోహన్ నాయక్ అనే కాపలాదారుడు మేకల మందను మేతకు తీసుకెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానిక ప్రజలు.
మరో వైపు కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర లో ఏనుగు సంచారం కనిపించడంతో తూర్పు ప్రాంత ప్రజల్లో భయం రెట్టింపు అయ్యింది. ఆరు నెలల క్రితం మహారాష్ట్ర నుండి ప్రాణహిత దాటి కొమురంభీమ్ జిల్లాలో అడుగు పెట్టి ఇద్దరు రైతులను హతమార్చి వెళ్లిన ఏనుగు తాజా గా మరొసారి జిల్లాలో అడుగు పెట్టే అవకాశం ఉందన్న సమాచారంతో జిల్లా అటవీ శాఖ అప్రమత్తమైంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరీ అటవీ ప్రాంతంలో ఏనుగు కదిలికలను మహారాష్ట్ర అటవీ అధికారులు గుర్తించి కొమురం భీమ్ జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో కాగజ్ నగర్ కారిడార్ అటవీ ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.
గత ఏప్రిల్ నెలలో మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహేరీ మీదుగా ప్రాణహిత దాటి కొమురంభీమ్ జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగు ఏప్రిల్ 3న చింతలమానేపల్లి మండలం బాబాపూర్ గ్రామంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతు అల్లూరి శంకర్ పై దాడిచేసి హతమార్చింది. 24 గంటల వ్యవధిలోనే ఏప్రిల్ 4న పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారుపోశన్న అనే మరో రైతును వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్తున్న క్రమంలో కాలుతో తొక్కి చంపేసింది. ఈ వరుస సంఘటనలతో ప్రజలతోపాటు అటవీ అధికారులకు కంటిమీద కునుకులేకుండా పోయింది.
మదపుటేనుగును సరిహద్దులు కాగజ్ నగర్ కారిడార్ పరిదిలోని అటవీ అదికారులు మూడు రోజులు నానాతంటాలు పడక తప్పలేదు. డ్రోన్ కెమెరాలతో ఏనుగును గుర్తించిన అటవీశాఖ ప్రాణహిత దాటించేందుకు అష్టకష్టాలు పడ్డారు. కేవలం జిల్లా సరిహద్దుకు 35 కిలో మీటర్ల దూరంలో మాత్రమే సంచరిస్తున్న ఏనుగు మళ్లీ ప్రాణహిత దాటి జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని మహారాష్ట్ర అటవీశాఖ తెలపడంతో జిల్లా వాసుల్లో భయం అమాంతం పెరిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..