
రాజన్న సిరిసిల్ల జిల్లాలో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకవైపు తండ్రి మృతి, మరోవైపు జ పదో తరగతి పరీక్ష.. ఈ రెండు మధ్య నిలబడి ఓ విద్యార్థి చూపిన గుండె నిబ్బరం స్థానికులను కదిలించింది. పుట్టెడు దుఃఖంలోనూ.. ఓ విద్యార్థి పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. ఇటు పరీక్ష రాసి.. తరువాత తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన చందుపట్ల రాజిరెడ్డి హనుమాన్ మాలధారణలోనే హఠాన్మరణానికి గురయ్యారు. దీంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇంట్లో తండ్రి మృతదేహం ఉంచి బంధువులు, కుటుంబ సభ్యులు రోదనలు చేస్తున్న వేళ ఆయన కుమారుడు అక్షిత్ రెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తండ్రి అంత్యక్రియల నాడే పదో తరగతి పరీక్ష ఉండటంతో అతను తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. తండ్రి మృతిని తట్టుకోలేక అస్వస్థతకు గురైన అక్షిత్ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే, తండ్రి కలలను నెరవేర్చాలనే సంకల్పంతో అక్షిత్ రెడ్డి తన బాధను పక్కనపెట్టి పరీక్షకు హాజరయ్యాడు. తండ్రి మృతదేహం ఇంట్లోనే ఉండగా, కన్నీళ్లను దిగమింగి పరీక్ష హాలుకు వెళ్లడం స్థానికులను కదిలించింది. పరీక్ష పూర్తి చేసిన అనంతరం అక్షిత్ తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. పుట్టెడు దుఃఖంలోనూ భవిష్యత్తు కోసం అతను చూపిన ధైర్యం అందరినీ ఆలోచింపజేసింది. స్థానికులు అక్షిత్, తండ్రికి ఇచ్చిన నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన ఒక విద్యార్థి గుండె నిబ్బరానికి నిదర్శనంగా నిలిచింది. దుఃఖాన్ని జయించి ముందుకు సాగాలనే సందేశాన్ని సమాజానికి అందించింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..