WhatsApp: వాట్సాప్‌లో ఈ సీక్రెట్ సెట్టింగ్స్ వెంటనే ఆన్ చేసుకోండి.. హ్యాకర్లకు ఇలా చెక్ పెట్టండి..

మీ వాట్సాప్ ఖాతా సేఫ్‌గా ఉందా? వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను నేరుగా ఛేదించలేని హ్యాకర్లు.. ఓటీపీలు, ఫిషింగ్ లింకులు, క్యూఆర్ కోడ్ల ద్వారా సరికొత్త మోసాలకు తెరలేపారు. ప్రముఖుల అకౌంట్లే హ్యాక్ అవుతున్న ఈ రోజుల్లో మీ అకౌంట్ ఇనుప కోటలా మారాలంటే ఈ 4 సెట్టింగ్స్ వెంటనే ఆన్ చేసుకోండి.

WhatsApp: వాట్సాప్‌లో ఈ సీక్రెట్ సెట్టింగ్స్ వెంటనే ఆన్ చేసుకోండి.. హ్యాకర్లకు ఇలా చెక్ పెట్టండి..
How To Secure Whatsapp

Updated on: Jul 18, 2026 | 8:45 PM

వాట్సాప్ ఇప్పుడు కేవలం మెసేజ్‌లు పంపుకునే యాప్ మాత్రమే కాదు.. మన వ్యక్తిగత చాటింగ్‌లు, ఆఫీస్ డాక్యుమెంట్లు, బ్యాంకింగ్ లావాదేవీల సమాచారంతో కూడిన ఒక డిజిటల్ లాకర్. అందుకే సైబర్ మోసగాళ్లు చాలా కాలంగా ఈ యాప్‌పై కన్నేసి ఉంచారు. ఇటీవల పలువురు ప్రముఖుల వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అయ్యాయనే వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో సామాన్య యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్‌ను సైబర్ దొంగల బారిన పడకుండా కాపాడుకోవడం ఎలాగో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

హ్యాకర్ల కొత్త పంథా.. యూజర్‌నేమ్ ఫీచర్‌తో ముప్పు?

సైబర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మోసగాళ్లు వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను నేరుగా ఛేదించలేరు. దానికి బదులుగా వారు ఫిషింగ్ లింకులు, నకిలీ కస్టమర్ కేర్ కాల్స్, సిమ్ మార్పిడి, ఓటీపీలను దొంగిలించడం ద్వారా అకౌంట్లను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. మరోవైపు ప్రైవసీని పెంచేందుకు వాట్సాప్ త్వరలో తీసుకురానున్న యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం సందేహాలు వ్యక్తం చేస్తుంది. ప్రముఖ వ్యక్తులు లేదా సంస్థల పేర్లతో నకిలీ యూజర్‌నేమ్‌లను సృష్టించి మోసగాళ్లు ప్రజలను సులభంగా బురిడీ కొట్టించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీ వాట్సాప్‌ను ఇనుప కోటలా మార్చే ఆ 4 సెట్టింగ్స్ ఇవే..

టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయండి:

వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి టూ స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసి, ఒక 6 అంకెల పిన్ సెట్ చేసుకోండి. దీనివల్ల ఒకవేళ హ్యాకర్‌కు మీ ఓటీపీ దొరికినా, ఈ పిన్ నంబర్ తెలియకుండా వారు మీ అకౌంట్‌ను వేరే ఫోన్ లో లాగిన్ చేయలేరు.

పాస్‌కీ ని ఎనేబుల్ చేయండి

ఈ ఫీచర్‌ను ఆన్ చేయడం ద్వారా ఎస్ఎంఎస్ ఆధారిత వెరిఫికేషన్‌తో పని ఉండదు. మీ ఫోన్‌లోని ఫేస్ ఐడి, టచ్ ఐడి లేదా వేలిముద్రతోనే లాగిన్ అవ్వొచ్చు. పాస్‌కీ మీ పరికరంతోనే లింక్ అయి ఉంటుంది కాబట్టి దీనిని దొంగిలించడం హ్యాకర్లకు అసాధ్యం.

రికవరీ ఈమెయిల్ జోడించండి

ధృవీకరించబడిన ఈమెయిల్ ఐడీని మీ వాట్సాప్‌కు లింక్ చేయండి. మీ సిమ్ కార్డు పోయినా లేదా ఫోన్ నంబర్ మారినా అకౌంట్‌ను తిరిగి పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ ఇమెయిల్ ఐడికి కూడా స్ట్రాంగ్ పాస్‌వర్డ్, 2FA లాక్ ఉండాలి.

బయోమెట్రిక్ లాక్ వాడండి

మీ ఫోన్ పొరపాటున ఇతరుల చేతికి చిక్కినా మీ చాట్స్ చూడకుండా ఉండాలంటే వాట్సాప్ యాప్‌కు ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ లాక్ ఆన్ చేయండి. దీనివల్ల మీ ఫోటోలు, డాక్యుమెంట్లు సురక్షితంగా ఉంటాయి.

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా?

మెటా సంస్థ నివేదికల ప్రకారం.. మోసగాళ్లు తరచుగా మిమ్మల్ని నకిలీ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయమని లేదా అకౌంట్ లింకింగ్ కోడ్‌లను షేర్ చేయమని అడుగుతుంటారు. ఒక్కసారి మీ అకౌంట్ వేరే డివైజ్‌కు లింక్ అయితే, వాళ్లు మీ చాట్లను రహస్యంగా గమనిస్తూ, మీ పేరుతో ఇతరులను డబ్బులు అడిగే ప్రమాదం ఉంది.

గోల్డెన్ రూల్: మీ వాట్సాప్‌లో మీకు తెలిసిన వారు లేదా బంధువులు ఎవరైనా అత్యవసరంగా డబ్బులు కావాలని మెసేజ్ చేస్తే, బ్లైండ్‌గా నమ్మేయకండి. వెంటనే వారికి నార్మల్ వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ చేసి, ఆ విషయాన్ని స్వయంగా నిర్ధారించుకున్నాకే డబ్బులు పంపండి.

సైబర్ మోసాల పద్ధతులు రోజురోజుకూ మారుతున్నాయి. కానీ ఈ భద్రతా ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మీ వాట్సాప్ హ్యాక్ అయ్యే అవకాశాలను 99శాతం అడ్డుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ ఫోన్ తీసి ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.

Follow Us