
స్కూటర్ విభాగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ TVS Jupiter తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. కాలానుగుణంగా డిజైన్, ఫీచర్లలో మార్పులు చేస్తూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మోడళ్లను అప్డేట్ చేస్తోంది. ముఖ్యంగా Jupiter 110తో పాటు Jupiter 125కు లభిస్తున్న ఆదరణ ఈ కోటి యూనిట్ల ఉత్పత్తి మైలురాయిలో కీలక పాత్ర పోషించింది. ఈ ఘనతతో భారత స్కూటర్ మార్కెట్లో తన స్థానాన్ని మరోసారి చాటుకుంది.
TVS తొలిసారిగా 2013లో Jupiter 110 స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్‌ను రూపొందించింది. ఆ తర్వాత 2021లో Jupiter 125ను పరిచయం చేసింది. దీంతో ఈ స్కూటర్‌కు ఆదరణ మరింత పెరిగింది. 2022 నాటికి Jupiter ఉత్పత్తి 50 లక్షల యూనిట్లను దాటింది. అక్కడి నుంచి మరో 50 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకోవడానికి కేవలం నాలుగేళ్లే పట్టింది. అంటే గతంతో పోలిస్తే ఈ స్కూటర్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగింది.
అమ్మకాలను పెంచుకునేందుకు TVS ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వచ్చింది. ముఖ్యంగా 2024లో Jupiter 110లో కొత్త ఛాసిస్, అప్డేటెడ్ డిజైన్, ముందు భాగంలో ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ వంటి మార్పులు తీసుకొచ్చింది. Jupiter 125 నుంచి తీసుకున్న కొత్త ఇంజిన్‌ను కూడా ఇందులో అమర్చింది. అయితే Jupiter 125 మాత్రం 2021లో విడుదలైనప్పటి నుంచి పెద్దగా మార్పులు లేకుండానే కొనసాగుతోంది.
భారత స్కూటర్ మార్కెట్లో Honda Activa ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ TVS Jupiter కూడా గట్టి పోటీ ఇస్తోంది. TVS ఎలక్ట్రిక్ స్కూటర్ iQube అమ్మకాలు కూడా కంపెనీ స్కూటర్ విభాగంలో రెండో అతిపెద్ద తయారీ సంస్థగా ఎదగడానికి తోడ్పడ్డాయి. ప్రస్తుతం Jupiter ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
టాప్ డ్యూయల్ టోన్ వేరియంట్ ధర రూ.90,525గా ఉంది. ఇదే విభాగంలో Honda Activa 6G ధర రూ.91,082 కాగా, Hero Destini 110 ధర రూ.83,800గా ఉంది. ఈ మోడళ్లతో TVS Jupiter పోటీ పడుతోంది. 13 ఏళ్లలో కోటి యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడం కంపెనీకి కీలక విజయంగా నిలిచింది. రాబోయే రోజుల్లో ఈ స్కూటర్‌కు ఆదరణ మరింత పెరుగుతుందని TVS ఆశాభావం వ్యక్తం చేస్తోంది.