కరోనా మహమ్మారి మానవ జీవితంలో చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చింది. కొత్త కల్చర్‌ను అలవాటు చేసింది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగుల పనివిధానాల్లో కొత్త ట్రెండ్‌ను పరిచయం చేసింది. అదే వర్క్ ఫ్రం హోమ్. మరో విధంగాచెప్పాలంటే రిమోట్ వర్కింగ్. అంటే సంస్థ కార్యాలయంలో కాకుండా ఉద్యోగులు తమ ఇళ్లలోనే ఉంటూ విధులు నిర్వర్తించడం అన్నమాట. అయితే కరోనా అనంతర పరిణామాల్లో ఈ విధానాన్ని చాలా కంపెనీలు నిలిపివేశాయి. తిరిగి కార్యాలయాలకు ఉద్యోగులు రావాల్సిందేనని సంస్థలు ఆదేశించాయి. అయితే ఆ సమయంలో చాలా మంది వ్యక్తులు ఇంటి నుంచి పని చేయడం వల్ల ప్రయోజనం పొందారు. ప్రయాణ సమయాలు ఆదా అవడంతోపాటు, ఖర్చులు కూడా తగ్గించుకోగలిగారు. అయితే కంపెనీలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని నిలిపివేస్తున్నటప్పటికీ అనేక సంస్థలు ఆన్‌లైన్ ద్వారా ఈ అవకాశాన్ని అందిస్తున్నాయి. చాలా వెబ్ సైట్లు కేవలం రిమోట్ వర్కింగ్ కోసం ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి సాధారణ కంపెనీలకు సరిసమానంగా జీతాన్ని అందిస్తున్నాయి.
కొన్ని ఆన్‌లైన్ నివేదికల ప్రకారం, ఉద్యోగులకు రిమోట్ పనిని అందించే వెబ్‌సైట్‌లు ఇంటర్నెట్‌లో చాలానే ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం ఉద్యోగులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు లేదా కార్యాలయంలో చేరాల్సిన అవసరం లేదు. వారు ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి అయినా పనిచేసే వెసులుబాటు ఉంటుంది. జీతం పరంగా, ఈ ఉద్యోగాలలో కొన్ని డాలర్లలో కూడా చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలను ఫ్రీలాన్స్ ఉద్యోగాలుగా సూచిస్తారు. అయితే ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ చేసే ముందు సరైన రీసెర్చ్ చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక్కడ మోసానికి ఎక్కువ అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఫ్రీలాన్స్ ఉద్యోగంలో, ఏ కంపెనీతోనూ శాశ్వత ఒప్పందం లేని వ్యక్తులు వేర్వేరు వ్యక్తులు లేదా కంపెనీల కోసం పని చేస్తారు. వారు ఎక్కడి నుంచైనా, ఏదైనా కంపెనీ లేదా ఏ వ్యక్తి నుంచి అయినా పనిని చేపట్టవచ్చు. డిమాండ్ మేరకు పూర్తి చేయవచ్చు. ఉద్యోగం కష్టాన్ని బట్టి వేర్వేరు జీతాలు లేదా వేతనాలు అందుతాయి. అనుభవజ్ఞులైన ఫ్రీలాన్సర్లుగా ఉన్న వ్యక్తులు కూడా వారి జీతం కోసం చర్చలు జరపవచ్చు. వారిలో కొందరు వేల డాలర్లు కూడా సంపాదిస్తున్న వారు ఉన్నారు. మార్కెట్లో ఎక్కువ ఫ్రీలాన్సింగ్ చేసే ఉద్యోగాలలో వెబ్‌సైట్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, బ్లాగ్ రైటింగ్, కోడింగ్ మొదలైనవి ఉన్నాయి.
ఈ వెబ్‌సైట్‌లలో పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లు తమ అవసరాలను పోస్ట్ చేస్తారు. పనిని పూర్తి చేయడానికి ఫ్రీలాన్సర్‌లను నియమించుకుంటారు. ప్రజలు సేల్స్, మార్కెటింగ్, సోషల్ మీడియా, యూఎక్స్/యూఐ, రైటింగ్ రంగాల వారికి అధిక డిమాండ్ ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..