Cell phone disadvantages: అనుబంధాలను తుంచేస్తున్నసెల్ ఫోన్.. మితిమీరి వాడితే అనేక అనర్థాలు
ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగంగా విపరీతంగా పెరిగింది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకూ ప్రతి నిమిషం అత్యవసరంగా మారింది. కాల్స్ మాట్లాడడంతో పాటు అనేక పనులు, ఆర్థిక లావాదేవీల నిర్వహణకు చాలా ఉపయోగపడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ లేకపోతే రోజు గడవని పరిస్థితి నెలకొంది. అయితే అవసరం ఉన్నంత వరకూ దీన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. ఆ పరిమితి దాటి వాడితే అనేక అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ ఆడుతూ, రీల్స్ చూస్తూ గడిపేస్తున్నారు. దీని వల్ల వారిపై అనేక దుష్పబ్రాలు చూపుతున్నాయి. వాటి నివారణకు నిపుణులు చెప్పిన చిట్కాలను తెలుసుకుందాం.

స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగితే ఆ కుటుంబాలకు కలిగే నష్టాలపై వీవో, సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) ఇటీవల ఓ అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ సమయం గడపడం వల్ల ఆ కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధాలు తగ్గిపోతాయి. ఈ అధ్యయనంలో 69 శాతం మంది పిల్లలు, 73 శాతం మంది తల్లిదండ్రులు ఈ విషయాన్ని అంగీకరించారు. కుటుంబంలో సంఘర్షణలకు అదే మూలమని అభిప్రాయపడ్డారు. పిల్లలు కొన్ని సోషల్ మీడియా యాప్ లకు దూరంగా ఉండాలని 90 శాతం మంది అభిప్రాయపడ్డారు.
స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వినియోగించడం అనేది పిల్లలతొో పాటు చాలా మంది పెద్దలకు అలవాటుగా ఉంటుంది. కొందరు పెద్దలు దాదాపు రోజంతా ఫోన్ లోనే గడుపుతారు. ఇంటిలో పిల్లల మధ్య ఉన్నప్పుడు కూడా ఫోన్ లోకంలోనే ఉంటారు. ఇలాంటి సందర్భంలో పిల్లలు మానసికంగా ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులు తమకు దూరంగా ఉన్నారనే అభిప్రాయానికి వస్తారు. ముఖ్యంగా నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తారు. ఇది వారిలో ఆత్మగౌరవం తగ్గడానికి, ఒంటరితనానికి దారి తీస్తుంది. అలాగే తల్లిదండ్రుల మాదిరిగానే తాము కూడా ఫోన్ వాడటాన్ని అలవాటు చేసుకుంటారు.
ఫోన్ వినియోగంలో కొన్ని నిబంధనలు ఏర్పర్చుకుంటే కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధం మరింత బలపడుతుంది. పిల్లలు ఏ సమస్య వచ్చినా తమ తల్లిదండ్రులతో చెప్పుకోగలుగుతారు. దీని కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి. నిద్ర పోయే ముందే ఫోన్ ను పక్కన పెట్టేయ్యాలి. పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడడంతో పాటు వారిలో ఆటలు ఆడడం, పుస్తకాలు చదవడం వంటివి చేయాలి. ముఖ్యంగా సెల్ ఫోన్ వాడకానికి సమయం కేటాయించాలి. దీని కోసం స్క్రీన్ టైమ్ మేనేజ్ మెంట్ యాప్ లను వాడుకుని స్క్రీన్ టైమ్ ను ట్రాక్ చేయాలి. దీని వల్ల పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఫోన్ వల్ల కలిగే అనర్థాల నుంచి దూరంగా ఉండవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






