
తీరప్రాంతాల్లో కాలుష్యం, పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు పర్యావరణానికి సవాలుగా మారుతున్నాయి. ఈ సమయంలో సముద్ర స్పంజులతో నిర్వహించిన ప్రయోగం శాస్త్రవేత్తలకు ఆశలు కలిగించింది. ఒక స్పంజ్ జాతి కలుషిత నీటిలో 91.7 శాతం జీవించి, చిన్న భాగాలుగా విడిపోయి కొత్త చోట్ల పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. సముద్ర పునరుద్ధరణకు ఇవి ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. తక్కువ ఖర్చుతో పాడైన తీర ప్రాంతాలను పునరుద్ధరించేందుకు ఈ ఫలితాలు ఉపయోగపడే అవకాశం ఉంది.
స్పెయిన్‌లోని కోస్టా బ్రావా ప్రాంతంలో ఉన్న మెరీనా పలామోస్‌లో పరిశోధకులు ఈ ప్రయోగం చేపట్టారు. మానవ కార్యకలాపాలు ఎక్కువగా ఉండి కాలుష్యానికి గురైన ఈ ప్రాంతంలో సముద్ర స్పంజులు ఎలా బతుకుతాయో తెలుసుకునేందుకు మధ్యధరా సముద్రానికి చెందిన రెండు జాతులను ఎంచుకున్నారు. వాటిని పోర్ట్‌లోని కృత్రిమ నిర్మాణాలపై అమర్చి 455 రోజుల పాటు పర్యవేక్షించారు.
ప్రయోగం పూర్తయ్యే సరికి ఒక జాతి స్పంజ్ 91.7 శాతం జీవించి ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. రెండో జాతి మాత్రం కలుషిత వాతావరణాన్ని తట్టుకోలేక చాలా వరకు నశించింది. దీంతో అన్ని స్పంజ్ జాతులు కాలుష్యాన్ని తట్టుకోలేవని, పునరుద్ధరణకు సరైన జాతిని ఎంచుకోవడం కీలకమని స్పష్టమైంది.
సముద్ర స్పంజులు నీటిని వడకట్టే జీవులుగా పనిచేస్తాయి. సముద్ర జలాన్ని శరీరంలోకి తీసుకుని బయటకు పంపే సమయంలో బ్యాక్టీరియా, సూక్ష్మ కణాలు, కొన్ని వ్యర్థ పదార్థాలను గ్రహిస్తాయి. అందుకే వీటిని సముద్ర పర్యావరణ వ్యవస్థల్లో కీలక జీవులుగా శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. వీటి శరీర నిర్మాణం చిన్న సముద్ర జీవులకు ఆశ్రయంగా కూడా ఉంటుంది.
ప్రయోగంలో మరో ఆసక్తికర విషయం బయటపడింది. పెద్ద స్పంజ్ నుంచి విడిపోయిన చిన్న భాగాలు నీటి ప్రవాహంలో తేలుతూ సమీప ఉపరితలాలపై స్థిరపడి, అక్కడ పూర్తిస్థాయి స్పంజులుగా పెరిగాయి. వీటిని ‘మొబైల్ క్లోన్స్’గా పేర్కొన్నారు. ఈ విధంగా అవి సహజంగానే ఇతర ప్రాంతాలకు విస్తరించగలవు. సరైన జాతులను ఎంచుకుని నౌకాశ్రయాలు, మెరీనాల్లో పెంచితే తీర ప్రాంత పునరుద్ధరణకు తక్కువ ఖర్చుతో సహజ మార్గం లభించే అవకాశం ఉందని ఈ అధ్యయనం సూచిస్తోంది.