Planets Parade: ఒకే సమాంతర రేఖలోకి ఐదు గ్రహాలు.. కనిపించింది మాత్రం ఆ రెండు గ్రహాలే.. అవేంటుంటే..

|

Mar 28, 2023 | 9:38 PM

అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు.. ఊహకందని వింతలు.. అలాంటి అద్భుతం మరోసారి ఆవిస్కృతమైంది. ఐదు గ్రహాలు ఒకే సమాంతర రేఖలోకి వచ్చాయి. అయితే వాటిలో రెండు గ్రహాలను మాత్రమే చూడగలిగాం. ఇక ఈ అరుదైన దృశ్యాన్ని రాశులకు ముడిపెడుతున్నారు పండితులు. యథావిథిగా జ్యోతిష్యుల అభిప్రాయాలను విభేదించారు ఖగోళ శాస్త్రవేత్తలు.

Planets Parade: ఒకే సమాంతర రేఖలోకి ఐదు గ్రహాలు.. కనిపించింది మాత్రం ఆ రెండు గ్రహాలే.. అవేంటుంటే..
Planets Parade
Follow us on

అంతరిక్షంలో ఎన్నో వింతలు కనిపిస్తుంటాయి. గ్రహాల కూటములు ఏర్పడటం.. గ్రహాలు భూమికి దగ్గరగా రావడం లాంటి ఎన్నో అద్భుత దృశ్యాలు గతంలో చూశాం. అయితే, ఇప్పుడు సరిగ్గా అలాంటిదే ఆకాశంలో ఏర్పడింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు గ్రహాలు ఒకే సమాంతర రేఖలోకి వచ్చాయి. బుధుడు, శుక్రుడు. కుజుడు, గురుగ్రహం, యురేనస్.. కనువిందు చేశాయి. 6.36 గంటల నుంచి 7.15 మధ్య ఈ ఐదు గ్రహాలు సమాంతర రేఖలో కనిపించాయి. కోల్‌కతాలో సూర్యాస్తమయం ఈరోజు సాయంత్రం 5.50 గంటలకు, ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో వరుసగా సాయంత్రం 6.36, 6.51, 6.31 గంటలకు ఆకాశం నుంచి సూర్యుడు అదృశ్యమయ్యాడు. సాయంత్రం ఆకాశంలో చాలా ప్రకాశవంతమైన గ్రహాలు కనిపించాయి. చిన్న టెలిస్కోపుల సహాయంతో యురేనస్ గ్రహం శుక్రుడికి ఉత్తరంగా కూడా చూడవచ్చు. శుక్రుడు, యురేనస్ రెండూ చాలా కాలం పాటు ఆకాశంలో కనిపిస్తాయి.

అయితే గ్రహాల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో ఆకాశంలో కేవలం రెండు గ్రహాలు మాత్రమే కనిపించాయి. తూర్పు, ఈశాన్య భారతదేశానికి చెందిన ప్రజలు ఈ ప్రత్యేకమైన ఖగోళ దృశ్యాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఉత్తర, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల ప్రజలు ఐదు గ్రహాలను చూడటం కష్టంగా ఉండవచ్చు.

మీన రాశిలో బుధుడు, బృహస్పతి, రవి.. మేష రాశిలో శుక్రుడు, రాహువు.. మిథున రాశిలో కుజుడు అలాగే వృషభ రాశిలో చంద్రుడు ప్రవేశించినట్టు జ్యోతిష్యులు అంచనా వేశారు. ఆకాశంలో కనువిందు చేసిన ఈ అద్భుత పరిణామంతో.. కొన్ని రాశుల వారికి అనుకూల.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావంత చూపుతుందని అభిప్రాయపడ్డారు పండితులు.

మేష రాశి వారికి కొంత ఆరోగ్య సమస్యలు వస్తాయనీ.. స్వల్పకాలిక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు జ్యోతిష్యపండితులు శ్రీకృష్ణ. వృషభ రాశి వారికి శుభసూచికంగా ఉందనీ.. మిథున రాశి వారికి అఖండ యోగం పడుతుందన్నారు. ఇక కర్కాటక రాశి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయనీ.. ఉద్యోగ రీత్యా సానుకూల మార్పులు ఉండొచ్చన్నారు జ్యోతిష్యపండితులు శ్రీకృష్ణ. గ్రహాలతో జాతకాలను ముడిపెడుతూ జ్యోతిష్య శాస్త్రం అంచనా వేస్తుంటే.. అలాంటిదేమీ లేదని కొట్టి పారేస్తోంది ఖగోళ శాస్త్రం. ఇది సహజ సిద్ధంగా ఏర్పడే వింత మాత్రమే అంటున్నారు.

రాజకీయ పరిణామాలతో పాటు.. పలు అంశాలపై ఈ ప్రభావం ఉంటుందని జ్యోతిష్యులు వాదిస్తుంటే.. ఎలాంటి సంబంధం లేదంటోంది విజ్ఞాన శాస్త్రం. వీళ్లిద్దరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ ఆకాశంలో ఏర్పడిన ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు. టెలిస్కోప్ సాయంతో గ్రహాల గమనాన్ని పరిశీలించారు శాస్త్రవేత్తలు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం