
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇప్పుడు మైలేజీపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. చాలా మంది వేగంగా వెళ్తే సమయం ఆదా అవుతుందని భావించినా, అధిక వేగం ఇంధన ఖర్చును గణనీయంగా పెంచుతుందని ఆటో నిపుణులు చెబుతున్నారు. సరైన వేగంతో కారు నడిపితే ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం సాధారణ పెట్రోల్, డీజిల్ కార్లకు గంటకు 80 నుంచి 95 కిలోమీటర్ల వేగం అత్యంత అనుకూలం. ఈ వేగంలో ఇంజిన్‌పై అధిక ఒత్తిడి ఉండదు. అలాగే గాలి నిరోధకత కూడా తక్కువగా ఉండటంతో ఇంధన వినియోగం నియంత్రణలో ఉంటుంది.
అయితే వేగం గంటకు 110 కిలోమీటర్లకు చేరిన తర్వాత ఇంధన వినియోగం వేగంగా పెరుగుతుందని చెబుతున్నారు. గంటకు 95 కిలోమీటర్ల వేగంతో పోలిస్తే 110 కిలోమీటర్ల వేగంలో దాదాపు 9 శాతం ఎక్కువ ఇంధనం ఖర్చవుతుందని అంచనా. అదే 130 కిలోమీటర్ల వేగంతో నడిపితే ఇంధన వినియోగం 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గాలి నిరోధకత. వాహనం వేగం పెరిగే కొద్దీ గాలి ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది. ఆ ఒత్తిడిని అధిగమించేందుకు ఇంజిన్ ఎక్కువ శక్తిని వినియోగించాల్సి వస్తుంది. ఫలితంగా పెట్రోల్ లేదా డీజిల్ వినియోగం పెరుగుతుంది.
అదే సమయంలో చాలా తక్కువ వేగంతో ఎక్కువసేపు డ్రైవ్ చేయడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ గేర్‌లో ఎక్కువసేపు వాహనం నడిస్తే ఇంజిన్ ఆర్‌పీఎం పెరిగి ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి వాహనం వేగం పెరిగిన వెంటనే సరైన గేర్‌లోకి మార్చడం అవసరం. హైవేపై క్రూయిజ్ కంట్రోల్ ఉపయోగించడం కూడా ఇంధన ఆదాకు దోహదపడుతుంది. ఇది వాహనాన్ని ఒకే వేగంతో నడిపేలా చేస్తుంది. తరచూ బ్రేక్‌లు వేయడం, ఒక్కసారిగా వేగం పెంచడం తగ్గిపోవడంతో ఇంధన వినియోగం నియంత్రణలో ఉంటుంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే, గంటకు 65 నుంచి 80 కిలోమీటర్ల వేగం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వేగంలో బ్యాటరీపై ఒత్తిడి తగ్గి, రేంజ్ మెరుగుపడే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి