ఒకప్పుడు ఫోన్ అంటే నోకియా. కనెక్టింగ్ పీపుల్ అనే స్లోగన్ తో వచ్చి నిజంగా జనాలతో బాగా కనెక్ట్ అయిపోయింది. అయితే ఆండ్రాయిడ్ ల రాకతో శామ్సంగ్ గేలాక్సీ ప్రభంజనంలో నోకియా ఫీచర్ ఫోన్లు తెరమరుగయ్యాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ ఆండ్రాయిడ్ బాట పడుతున్న నోకియా కొత్త ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలో మరోసారి అతి తక్కువ ధరలో ఫీచర్ ఫోన్లను తీసుకొచ్చింది. నోకియా 110 4జీ, నోకియా 110 2జీ పేరిట వీటిని లాంచ్ చేసింది. మోడ్రన్ లుక్‌లో అధిక నాణ్యతతో వీటిని విడుదల చేసింది. ఈ ఫోన్లు మిడ్ నైట్ బ్లూ, ఆర్టిక్ పర్పుల్, కార్కోల్, క్లౌడీ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
నోకియా 110 4జీ, నోకియా 110 2జీ ఫోన్లలో ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే హెచ్ డీ వాయిస్ క్లారిటీ. ఇప్పటికే ఈ తరహా ఫీచర్ జియో లేటెస్ట్ భారత్ ఫోన్లలో తీసుకొచ్చింది. అలాగే ఈ ఫీచర్ ఫోన్లలోనే యూపీఐ పేమెంట్ ఆప్షన్ కూడా తీసుకొచ్చింది. ఈ ఫోన్ల నుంచే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్స్ చేసేయొచ్చు.
నోకియా 110 4జీ, నోకియా 110 2జీ ఫోన్లలో వెనుకవైపు బిల్ట్ ఇన్ కెమెరా ఉంటుంది. అలాగే ఎస్డీ కార్డు స్లాట్ కూడా ఉంటుంది. 32 జీబీ వరకూ ఎక్స్ పాండబుల్ మెమరీ ఉంటుంది. సంగీత ప్రియులకు మ్యూజిక్ ప్లేయర్, ఆటో కాల్ రికార్డర్ ఉంటుంది. నోకియా 110 4జీ లో 150ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. నోకియా 110 2జీ ఫోన్లో 1000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది.
ఈ సందర్భంగా హెచ్ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ రవి కున్వర్ మాట్లాడుతూ తమన వినియోగదారులకు విప్లవాత్మక ఫీచర్లతో కూడిన అత్యుత్తమ ఫోన్ అనుభవాన్ని అందించేందుకు ఈ కొత్త ఫీచర్ ఫోన్లను తీసుకొచ్చినట్లు చెప్పారు. మారుతున్న కాలానుగుణంగా దీనిలో అనేక మార్పులు చేసి, కొత్త ఫీచర్లతో తీసుకొచ్చామన్నారు.
నోకియా 110 4జీ రెండు రంగులలో లభిస్తోంది. అవి మిడ్‌నైట్ బ్లూ, ఆర్టిక్ పర్పుల్. అలాగే నోకియా 110 2జీ కూడా చార్‌కోల్, క్లౌడీ బ్లూ అనే రెండు రంగులలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను నోకియా రిటైల్ స్టోర్‌లు, నోకియా ఆన్‌లైన్ పార్టనర్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. నోకియా 110 2జీ ధర రూ. 1,699కాగా, నోకియా 110 4జీ ధర రూ. 2499గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..