అంతరిక్షంలో నిత్యం ఎన్నో గ్రహశకలాలు వాయు వేగంతో సంచరిస్తూనే ఉంటాయి. ఒక నిర్ధిష్ట కక్ష్యలో అత్యంత వేగంతో ఈ గ్రహశకలాలు భ్రమిస్తుంటాయి. అయితే వీటిలో గ్రహ శకలాలు మాత్రం ఎలాంటి లక్ష్యం లేకుండా, ఒక నిర్ధిష్ట కక్ష్యలేకుండా చక్కర్లు కొడుతుంటాయి. వీటివల్లే అప్పుడప్పుడు భూమికి ప్రమాదం పొంచి ఉంటుంది. తాజాగా ఇలాంటి ఓ గ్రహశకలాన్ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.
నాసా పరిశోధకులు చెబుతోన్న వివరాల ప్రకారం.. ఈ గ్రహశకలం ఏకంగా 1,610 అడుగుల వెడల్పు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ భారీ గ్రహశకలం అత్యంత వేగంగా భూమిని ఢీకొట్టడానికి దూసుకొస్తోంది. ఈ గ్రహశకలాన్ని బెన్నూ గ్రహశకలంగా నామకరణం చేశారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ గ్రహశకలంతో భూమికి ఎలాంటి ముప్పు లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు 159 ఏళ్ల తర్వాత భూమిని బలంగా ఢీకొట్టబోతోందని పరిశోధకులు అంచనా వేశారు. ఈ గ్రహ శకలాన్ని 1999లో పరిశోధకులు గుర్తించారు.
నాసాకి చెందిన ఓసిరీస్ రెక్స్ సైన్స్ సభ్యులు ఈ గ్రహశకలాన్ని 1999లో గుర్తించారు. అయితే ఈ శకలం ప్రస్తుతం భూమి కక్ష్యా మార్గంలో లేదని చెప్పిన శాస్త్రవేత్తలు.. 2182 సెప్టెంబర్ 24వ తేదీన భూకక్ష్యలోకి ప్రవేశిస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టితే 1200 మెగా టన్నుల శక్తీ విడుదల అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న అతిపెద్ద అణు బాంబు కంటే 24 రెట్లు ఎక్కువ శక్తి విడుదలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే ఈ గ్రహశకలం కచ్చితంగా భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టేందుకు అవకాశం ఉన్న గురుత్వాకర్షణ మార్గం నుంచి ఈ గ్రహశకలం వెళ్లే అవకాశం చాలా తక్కువ ఉందని నాసా తెలిపింది. ఒకవేళ ఈ గ్రహశకలం గురుత్వాకర్షణ మార్గం నుంచి వెళ్తే మాత్రం భూమిని ఢీకొట్టే ప్రమాదం కచ్చితంగా పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బెన్నూ గ్రహశకలం నాసా ప్రకటించిన ప్రమాదకరమైన గ్రహశకలాల జాబితాలో ఉంది. ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు 46.5 కోట్ల మైళ్ల దూరంలో ఉంటుందని చెబుతున్నారు.
బెన్నూ గ్రహశకలం అనేది బొగ్గుతో తయారైంది. ఇది సౌర వ్యవస్థ ఏర్పడిన తొలి కోటి సంవత్సరాల కాలంలో ఏర్పడింది దీని వయసు సుమార 450 కోట్ల ఏళ్లకుపైమాటే అని అంచనా వేస్తున్నారు. ఈ గ్రహశకలాన్ని పరిశీలిస్తే.. సౌర వ్యవస్థ, జీవం ఎలా ఏర్పడిందో తెలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2020లో ఓసీరీస్ రెక్స్ అనే స్పేస్ క్రాఫ్ట్.. ఈ గ్రహశకలంపై దిగి నమూనాలను సేకరించింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..