అంతరిక్షంపై పట్టు బిగించేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. మార్స్‌పై ప్రయోగాలు నడుస్తుండగానే మరోవైపు వీనస్‌పై ఫోకస్ పెట్టాయి. అందరికంటే ముందు వరసలో నాసా నిలిచింది. తాజాగా శుక్ర గ్రహంపై పరిశోధనల కోసం రెండు వ్యోమనౌకలను ప్రయోగించనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ NASA ప్రకటించింది. ఈ దశాబ్దం చివర్లో వీటిని పంపుతామని వెల్లడించింది. భూమికి అత్యంత సమీపంలో ఉన్న ఈ గ్రహం నిప్పుల కొలిమిలా మారడానికి దారితీసిన పరిస్థితులపై పరిశోధన సాగించడం ఈ ప్రయోగాలు పనిచేస్తాయిని ప్రకటించింది .
శుక్రుడి ఉపరితలంపై సీసం కూడా కరిగిపోయేలా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దీనికి కారణాలను ఈ వ్యోమనౌకలు వెలుగులోకి తెస్తాయి. దాదాపు 30 ఏళ్లుగా ఆ గ్రహంపై మనం పరిశోధనలు సాగించలేదు. ఇప్పుడు అక్కడి పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలకు ఇదో అవకాశం అని నాసా అధిపతి బిల్ నెల్సన్ పేర్కొన్నారు. ‘డిస్కవరీ’ కార్యక్రమం కింద నాసా ఈ ప్రాజెక్టును చేపట్టిందని తెలిపారు.
ఈ కార్యక్రమం కింద ఈ రెండు వ్యోమనౌకల కోసం 50 కోట్ల డాలర్లను కేటాయించింది. వీటికి “డావించి+, వెరిటాస్” అని పేర్లు పెట్టింది. శుక్ర గ్రహ వాతావరణంలోని మూలకాలపై మరిన్ని వివరాలను ‘డావించి+’ సేకరిస్తుంది. తద్వారా ఆ గ్రహ ఆవిర్భావం, పరిణామక్రమాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు పరిశోధకులు.
ఆ తర్వాత రెండో ప్రయోగం.. శుక్రుడిపై ఒకప్పుడు సాగరాలు ఉండేవా అన్నది కూడా ఈ వ్యోమనౌక శోధిస్తుంది. ‘వెరిటాస్’.. శుక్రుడి ఉపరితల మ్యాపింగ్‌ను చేపడుతుంది. అక్కడ అగ్నిపర్వతాలు ఉన్నాయా..!, భూకంపాలు చోటుచేసుకుంటున్నాయా…! అన్నది తేల్చేందుకు రాడార్‌ను ఉపయోగిస్తుంది. పరారుణ స్కానింగ్ ద్వారా అక్కడి శిలలను పరిశోధిస్తుంది.
డావించి+, వెరిటాస్‌లను 2028-30లో ప్రయోగించే అవకాశం ఉంది. నాసా చివరిసారిగా 1990లో శుక్రుడి వద్దకు ‘మ్యాగెలాన్’ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది.