
మెటా సంస్థలో ఒక పెద్ద సెక్యూరిటీ లోపం బయటపడటంతో ఉద్యోగుల డేటా భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆఫీస్ కంప్యూటర్లలోని అత్యంత సున్నితమైన సమాచారం ఇతర ఉద్యోగులకు కూడా అందుబాటులోకి రావడంతో, కంపెనీ సదరు ట్రాకింగ్ ప్రోగ్రామ్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. కేవలం ఏఐ శిక్షణ కోసం మొదలైన ఈ ప్రయత్నం, ఇప్పుడు డేటా లీకేజీ వ్యవహారంగా ఎలా మారిందో తెలుసుకుందాం!
ఏప్రిల్ 2026లో ప్రారంభమైన ‘మోడల్ క్యాపబిలిటీ ఇనిషియేటివ్’ (MCI) అనే ప్రోగ్రామ్ ద్వారా, మెటా తన ఏఐ మోడళ్లను మరింత సమర్థవంతంగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం అమెరికాలోని తన ఉద్యోగుల కంప్యూటర్ కార్యకలాపాలను ట్రాక్ చేయడం ప్రారంభించింది. మౌస్ కదలికలు, క్లిక్స్, కీస్ట్రోక్‌లు, అప్పుడప్పుడు స్క్రీన్‌షాట్‌లను సేకరించి, మనుషులు సాఫ్ట్‌వేర్‌ను ఎలా ఉపయోగిస్తారో ఏఐకి నేర్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
ఈ ప్రోగ్రామ్ ద్వారా సేకరించిన సున్నితమైన సమాచారం.. అనుమతి లేని ఇతర ఉద్యోగులకు కూడా సులభంగా అందుబాటులోకి రావడం పెద్ద సెక్యూరిటీ లోపంగా బయటపడింది. ఓ ఉద్యోగి సమర్పించిన హై-ప్రయారిటీ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రిపోర్ట్ (SEV) ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. exposed అయిన డేటాలో ఏఐ ప్రాంప్ట్‌లు, ప్రైవేట్ సంభాషణలు, పనితీరుకు సంబంధించిన సమాచారం, వ్యక్తిగత వివరాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైనప్పటి నుంచే మెటా ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ప్రైవసీని ఉల్లంఘిస్తూ పని ప్రదేశంలో నిఘా పెట్టడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పన్ను వివరాలు, వైద్యపరమైన సమాచారం వంటి సున్నితమైన అంశాలు కూడా సేకరిస్తున్నారని, అవి ఎన్‌క్రిప్షన్ లేకుండానే నిల్వ చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. ఇటీవల కంపెనీ చేపట్టిన తొలగింపులు చర్యల వల్ల ఉద్యోగుల నైతికత ఇప్పటికే తక్కువ స్థాయిలో ఉండగా, ఈ కొత్త నిఘా చర్యలు వారిలో మరింత అసహనాన్ని పెంచాయి.
డేటా భద్రత విషయంలో మెటా ఎదుర్కొంటున్న ఈ తాజా సవాలు.. ఏఐ అభివృద్ధిలో భాగంగా పద్ధతులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రామ్ నిలిపివేసినప్పటికీ, భవిష్యత్తులో ఇది ఏ రూపంలో తిరిగి వస్తుందో లేదా పూర్తిగా రద్దు చేస్తారో కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడం కోసం సొంత ఉద్యోగులనే వాడుకోవాలనే మెటా ఆలోచన, ప్రైవసీ చట్టాలకు మరియు ఉద్యోగుల నమ్మకానికి ఇప్పుడు పెద్ద పరీక్షగా మారింది.