అరుదైన అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకున్న Maruti 800.. అంత స్పెషల్ ఏంటో తెలిస్తే షాక్

భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో మారుతి 800కు ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు కారు కొనడం అనేది సామాన్య కుటుంబాలకు పెద్ద కలగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో అందుబాటు ధరలో అందుబాటులోకి వచ్చిన మారుతి 800 లక్షలాది మంది కారు కలను నిజం చేసింది. భారతదేశంలో కార్ల వినియోగం పెరగడానికి ఈ మోడల్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అదే కారు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకుంది. ప్రతిష్టాత్మక FIVA వరల్డ్ వెహికల్ హెరిటేజ్ అవార్డును సొంతం చేసుకుని మరోసారి వార్తల్లో నిలిచింది.

అరుదైన అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకున్న Maruti 800.. అంత స్పెషల్ ఏంటో తెలిస్తే షాక్
Maruti 800 Wins Fiva World Vehicle Heritage Award

Updated on: Nov 19, 2026 | 8:50 PM

భారత ఆటోమొబైల్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచే ఈ గుర్తింపు వెనుక మారుతి 800కు ఉన్న చారిత్రక, సామాజిక ప్రాధాన్యం ఉంది. ఈ అవార్డును అందుకున్న తొలి, ఏకైక భారతీయ కారుగా మారుతి 800 గుర్తింపు పొందింది. ఈసారి 21 దేశాలకు చెందిన వాహనాలు అవార్డు కోసం పోటీపడగా, భారత్ నుంచి ఎంపికైన ఏకైక మోడల్ ఇదే కావడం విశేషం. కేవలం వాహనం విలువ లేదా అరుదైన మోడల్ అనే అంశాలకే కాకుండా, ప్రజల జీవితాలపై చూపిన ప్రభావం, దేశ పారిశ్రామిక అభివృద్ధికి చేసిన సేవలను కూడా ఈ అవార్డు ఎంపికలో పరిగణనలోకి తీసుకున్నారు.

1983లో ప్రారంభమైన మారుతి 800 ప్రయాణం

భారత ప్రభుత్వం, జపాన్‌కు చెందిన Suzuki Motor Corporation భాగస్వామ్యంతో మారుతి 800 తయారైంది. SS80 పేరుతో రూపొందించిన ఈ కారు 1983 డిసెంబర్‌లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తొలి మారుతి 800ను హర్పాల్ సింగ్‌కు అందజేశారు. ఆ కారు రిజిస్ట్రేషన్ నంబర్ DIA 6479. ప్రస్తుతం ఈ చారిత్రక కారును ఢిల్లీలోని Maruti Suzuki ప్రధాన కార్యాలయంలో భద్రపరిచి ప్రదర్శిస్తున్నారు. తాజాగా లభించిన FIVA అవార్డు కూడా ఈ తొలి మారుతి 800కే దక్కడం మరో ప్రత్యేకత. Maruti Suzuki ఛైర్మన్ ఆర్.సి. భార్గవ ఈ గుర్తింపుపై సంతోషం వ్యక్తం చేశారు. మారుతి 800 దేశీయంగా నాణ్యమైన కార్లను తయారు చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని నిరూపించిందని తెలిపారు.

FIVA వరల్డ్ వెహికల్ హెరిటేజ్ అవార్డు

చారిత్రక వాహనాల పరిరక్షణ కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ లాభాపేక్షలేని సంస్థ Federation Internationale des Vehicules Anciens (FIVA). వాహనాలు కేవలం ప్రయాణ సాధనాలు మాత్రమే కాకుండా ఒక దేశ చరిత్ర, సంస్కృతి, పారిశ్రామిక అభివృద్ధికి ప్రతీకలని ఈ సంస్థ గుర్తిస్తుంది. ఈసారి అమెరికా, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్లోవేనియా సహా 21 దేశాల వాహనాలు అవార్డు కోసం ఎంపికయ్యాయి. వాటిలో మారుతి 800 భారతదేశం తరఫున ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒకప్పుడు సామాన్యుల కారు కలను నిజం చేసిన ఈ మోడల్‌కు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గౌరవం దక్కడం భారత ఆటోమొబైల్ రంగ చరిత్రలో మరో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.

Loading...
Unable to load recommendations.
Follow Us