Secured USB Drives: పెన్‌డ్రైవ్‌ సెక్యూరిటీ విషయంలో సరికొత్త ఆవిష్కరణ.. ఫింగర్‌ ప్రింట్‌ పెన్‌డ్రైవ్‌ల లాంచ్‌

| Edited By: Ram Naramaneni

Oct 15, 2023 | 7:07 PM

ముఖ్యంగా పెట్టుబడికి సంబంధించిన ఫైల్స్‌, బ్యాంక్‌ అకౌంట్‌కు సంబంధించిన వివరాలు, పొదుపునకు సంబంధించిన వివరాలు పెన్‌డ్రైవ్స్‌లో భద్రపరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వరకూ బాగానే ఉన్నా అనుకోని పరిస్థితుల్లో వాటిని పోగొట్టుకున్నా లేదా అవి వేరే వారికి దొరికినా సింపుల్‌గా కంప్యూటర్‌కు కనెక్ట్‌ చేసి వివరాలను తస్కరిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెట్టేలా ఫింగర్‌ ప్రింట్‌ పెన్‌డ్రైవ్స్‌ను లెక్సార్‌ కంపెనీ లాంచ్‌ చేసింది.

Secured USB Drives: పెన్‌డ్రైవ్‌ సెక్యూరిటీ విషయంలో సరికొత్త ఆవిష్కరణ.. ఫింగర్‌ ప్రింట్‌ పెన్‌డ్రైవ్‌ల లాంచ్‌
Fingure Print Pendrives
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో టెక్నాలజీ వేగంగా మారుతుంది. ఈ నేపథ్యంలో భద్రత అనేది గాల్లో దీపంలా మారింది. సాధారణంగా మనకు అవసరమైన ముఖ్యమైన ఫైల్స్‌, ఫొటోలు, వీడియోలు వంటివి మన కంప్యూటర్‌ లేదా ఫోన్స్‌లో భద్రపరుస్తాం. అయితే అవి కుటుంబ సభ్యులకు కూడా తెలియకూడనివి అయినా లేకపోతే ఆ ఫైల్స్‌ మరింత జాగ్రత్తగా పెట్టుకోవాలన్నా యూఎస్‌బీ డ్రైవ్స్‌ అంటే పెన్‌డ్రైవ్స్‌లో ఆ ఫైల్స్‌ వేసి జాగ్రత్తగా పెడుతూ ఉంటారు. ముఖ్యంగా పెట్టుబడికి సంబంధించిన ఫైల్స్‌, బ్యాంక్‌ అకౌంట్‌కు సంబంధించిన వివరాలు, పొదుపునకు సంబంధించిన వివరాలు పెన్‌డ్రైవ్స్‌లో భద్రపరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వరకూ బాగానే ఉన్నా అనుకోని పరిస్థితుల్లో వాటిని పోగొట్టుకున్నా లేదా అవి వేరే వారికి దొరికినా సింపుల్‌గా కంప్యూటర్‌కు కనెక్ట్‌ చేసి వివరాలను తస్కరిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెట్టేలా ఫింగర్‌ ప్రింట్‌ పెన్‌డ్రైవ్స్‌ను లెక్సార్‌ కంపెనీ లాంచ్‌ చేసింది. ఈ తాజా ఆవిష్కరణ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

లెక్సార్‌ అనేది ప్రముఖ గ్లోబల్ ఫ్లాష్ మెమరీ సొల్యూషన్స్ ప్రొవైడర్. ఈ కంపెనీ లెక్సార్‌ జంప్‌ డ్రైవ్‌ ఎఫ్‌ 35 3.0 పేరుతో డేటా భద్రతను అందించడానికి వేలిముద్ర గుర్తింపు సాంకేతికతతో కూడిన పెన్‌డ్రైవ్‌ను పరిచయం చేసింది. ఈ జంప్‌డ్రైవ్ ఎఫ్35 వినియోగదారులను ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్ ద్వారా తమ సెన్సిటివ్ డేటాను రక్షించుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే పెన్‌డ్రైవ్‌ను అధీకృత వ్యక్తులను మాత్రమే యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఈ పెన్‌డ్రైవ్‌ డేటా గోప్యతను నిర్ధారిస్తూ గరిష్టంగా 10 వేర్వేరు వేలిముద్రలను నిల్వ చేయగలదు. కంపెనీ తెలిపిన వివరాలను ఈ పెన్‌డ్రైవ్‌ను సెటప్ చేయడం చాలా సులభం. ఎందుకంటే దీనికి సాఫ్ట్‌వేర్ డ్రైవర్‌ల ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు. వినియోగదారులు తమ వేలిముద్రలతో ప్రామాణీకరించేటప్పుడు సులభంగా డ్రైవ్‌ను ప్లగ్ ఇన్ చేయవచ్చు. అలాగే పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

లెక్సార్‌ జంప్‌ డ్రైవ్‌ యూఎస్‌బీ 3.0 మద్దతుతో వస్తుంది. గరిష్టంగా 300 ఎంబీపీఎస్‌ బదిలీ వేగంతో పని చేస్తుంది. గరిష్టంగా 10 వేలిముద్ర ఐడీలకు మద్దతునిస్తుంది. ఒక సెకనులోపు అతివేగవంతమైన గుర్తింపు, సాఫ్ట్‌వేర్ డ్రైవర్లు అవసరం లేకుండా సులభంగా సెటప్ చేయవచ్చు. అలాగే ఈ పెన్‌డ్రైవ్‌పై మూడు సంవత్సరాల వారెంటీను ఇస్తున్నారు. ఈ పెన్‌డ్రైవ్‌ వివిధ నిల్వ సామర్థ్యాల్లో అందుబాటులో ఉంది. 32 జీబీ లెక్సార్‌ జంప్‌ డ్రైవ్‌ ధర రూ. 4,500గా ఉంది. 64 జీబీ మోడల్‌కు రూ. 6,000కు అందుబాటులో ఉంది. ఈ పెన్‌డ్రైవ్‌లను వివిధ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి.