
మనం కొత్త కారు కొనడానికి వెళ్లినప్పుడల్లా, అక్కడ ఆనందం, ఉత్సాహంతో కూడిన వాతావరణం ఉంటుంది. ఇంటికి కొత్త లక్ష్మి వస్తోందన్న సంబరంలో ఉంటాం. కానీ, షోరూమ్‌లో మెరుస్తూ మీకు అమ్ముతున్న ఆ కారు నిజానికి ఎంత కొత్తదో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక కారు తయారీ తేదీకి, దాని అమ్మకపు తేదీకి మధ్య కొన్ని నెలలు, లేదా కొన్నిసార్లు ఒక సంవత్సరం కంటే ఎక్కువ గ్యాప్ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులలో కొత్త కారు కొనుగోలు చేసిన కొన్ని నెలల్లోనే సమస్యలు రావడం మొదలవుతుందని లేదా దాని పనితీరు క్షీణిస్తుందని చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేస్తుంటారు. అంతేకాకుండా కారు వయస్సు దాని వారంటీ, బీమా, భవిష్యత్తులో రీసేల్ వాల్యూను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే కారు డెలివరీ తీసుకునే ముందు దాని అసలు వయస్సు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఒక కారు అసలు వయస్సును నిర్ధారించడానికి అత్యంత సులభమైన, నమ్మదగిన మార్గం దాని VIN (Vehicle Identification Number) లేదా ఛాసిస్ నంబర్‌ను చెక్ చేయడం. ఇది ప్రతి వాహనానికి ఉండే ఒక ప్రత్యేకమైన 17 అంకెల సంఖ్య. ఈ సంఖ్య సాధారణంగా డ్యాష్‌బోర్డ్‌పై, డ్రైవర్ వైపు తలుపు పక్కన, లేదా ఇంజిన్ బోనెట్ కింద కనిపిస్తుంది.VIN నంబర్‌లోని 10వ అక్షరం కారు తయారైన సంవత్సరాన్ని సూచిస్తుంది. దీనితో పాటు కారు తయారీ ప్లేట్‌ను కూడా తనిఖీ చేయాలి, దానిపై తయారీ నెల, సంవత్సరం స్పష్టంగా ఉంటాయి. ఈ ప్లేట్ సాధారణంగా డ్రైవర్ వైపు డోర్ లోపల లేదా హుడ్ కింద ఉంటుంది. కారు తయారై 6 నెలలు లేదా అంతకంటే పాతదైతే మీరు తప్పకుండా మీ డీలర్‌ను నిలదీయాలి.
కారు వయస్సును నిర్ధారించడానికి దాని టైర్లు కూడా కీలక సాక్ష్యాలుగా నిలుస్తాయి. ప్రతి టైరుపై నాలుగు అంకెల కోడ్ ఉంటుంది. ఉదాహరణకు.. టైరుపై 2322 అని ఉంటే… మొదటి రెండు అంకెలు వారాల సంఖ్యను, చివరి రెండు అంకెలు సంవత్సరాన్ని సూచిస్తాయి. అంటే అది 2022 సంవత్సరం 23వ వారంలో తయారైందని అర్థం. ఒకవేళ కారు బాడీ కొత్తగా ఉండి, టైర్లు మాత్రం చాలా పాతవి అయితే ఆ కారు చాలా కాలం పాటు షోరూమ్‌లో లేదా స్టాక్‌యార్డ్‌లో ఎండకు ఎండి, వానకు తడిసి ఉండిపోయిందని అర్థం చేసుకోవచ్చు.
టైర్లతో పాటు బ్యాటరీ తయారీ తేదీని కూడా చెక్ చేయాలి. ఎందుకంటే కారును ఎక్కువ కాలం నడపకుండా ఒకే చోట నిలిపి ఉంచడం వల్ల బ్యాటరీ సామర్థ్యం దెబ్బతింటుంది. మరో ముఖ్యమైన విషయం ఓడోమీటర్ రీడింగ్.. షోరూమ్‌లో డెలివరీ ఇచ్చే సరికొత్త కారు సాధారణంగా 10 నుండి 50 కిలోమీటర్ల రీడింగ్‌ను మాత్రమే కలిగి ఉండాలి. ఎందుకంటే ఫ్యాక్టరీ టెస్టింగ్, రవాణా సమయంలో మాత్రమే దాన్ని నడుపుతారు. ఒకవేళ రీడింగ్ ఎక్కువగా ఉంటే ఆ కారును డెమో లేదా టెస్ట్ డ్రైవ్ కోసం వాడి ఉండవచ్చు.
మీరు కొనే కారు చాలా పాతదని తెలిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధారణంగా, 3 నుండి 4 నెలల క్రితం తయారైన కారును కొనడం పెద్ద సమస్యేమీ కాదు. అయితే కారు 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ పాతదైతే మాత్రం, మీరు డీలర్‌ను ఎక్కువ డిస్కౌంట్ కోసం అడగవచ్చు. లేదా దానికి బదులుగా వేరే సరికొత్త కారును డెలివరీ ఇవ్వాలని పట్టుబట్టవచ్చు.
ప్రశ్న: పాత తయారీ తేదీ ఉన్న కారును కొనడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటి?
జవాబు : కారు ఎక్కువ కాలం స్టాక్‌యార్డ్‌లో ఉండిపోవడం వల్ల దాని రబ్బర్ విడిభాగాలు, టైర్లు, బ్యాటరీ లైఫ్ తగ్గుతాయి. అంతేకాకుండా మీరు కారును భవిష్యత్తులో అమ్మాలనుకున్నప్పుడు తయారీ సంవత్సరం ఆధారంగానే ధర లెక్కిస్తారు కాబట్టి రీసేల్ వాల్యూ తగ్గిపోతుంది.
ప్రశ్న: కారు వారంటీ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? తయారీ తేదీ నుంచా లేదా కొనుగోలు తేదీ నుంచా?
జవాబు : కారు వారంటీ సాధారణంగా మీరు కారు కొనుగోలు చేసిన తేదీ నుండి ప్రారంభమవుతుంది.
ప్రశ్న: ప్రీ డెలివరీ ఇన్‌స్పెక్షన్ అంటే ఏమిటి? ఇది ఎందుకు ముఖ్యం?
జవాబు : కారును డెలివరీ తీసుకోవడానికి ముందు కస్టమర్ స్వయంగా కారును చెక్ చేయడాన్ని PDI అంటారు. ఇందులో కారు బాడీపై స్క్రాచెస్, ఇంజిన్ కండిషన్, లైట్లు, తయారీ తేదీని వెరిఫై చేసుకోవచ్చు. ఏదైనా లోపం ఉంటే కారును తిరస్కరించే హక్కు కస్టమర్‌కు ఉంటుంది.