
Smartphone: డిజిటల్ ప్రపంచం పిల్లల ఎదుగుదలను మార్చేస్తోంది. సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇలా అన్నీ కలిసి నేటి తరం పిల్లల జీవితాలను రీప్రోగ్రామ్ చేస్తున్నాయి. దీనివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ఒక సంచలన కథనంలో హెచ్చరించారు. నేటి డిజిటల్ వాతావరణం కేవలం పిల్లల సమయాన్ని మాత్రమే కాదు, వారి ఆరోగ్యాన్ని, ఆలోచనా విధానాన్ని కూడా శాసిస్తోంది. ఈ విషయంలో ప్రపంచ దేశాలు వెంటనే మేల్కొనకపోతే భవిష్యత్తు తరం తీవ్రమైన సంక్షోభంలో పడుతుందని వారు స్పష్టం చేశారు. అతిగా డిజిటల్ స్క్రీన్లకు అతుక్కుపోవడం వల్ల పిల్లల్లో సమస్యలు తీవ్రమవుతున్నాయని నివేదిక వెల్లడించింది.
ఈ ముప్పును గుర్తించిన కొన్ని దేశాలు ఇప్పటికే సోషల్ మీడియాపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఆస్ట్రేలియా 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్లు తెరవకుండా ప్రపంచంలోనే మొదటిసారిగా నిషేధం విధించింది. ఫ్రాన్స్15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేసేలా చట్టాలు తెస్తోంది. యూకే, కెనడా, ఇండోనేషియా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా సేవలపై ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
కేవలం సాంకేతికతను తిట్టడం వల్ల ఉపయోగం లేదు. లాభాలను వాడుకుంటూనే నష్టాలను అరికట్టేలా గట్టి చర్యలు చేపట్టాలని WHO సూచించింది. సోషల్ మీడియా సంస్థలు పిల్లల డేటాను వాణిజ్య ప్రకటనల కోసం వాడుకోకుండా ప్రభుత్వాలు నియంత్రించాలి. జనరేటివ్ AI టూల్స్ పిల్లల సామాజిక సంబంధాలు, సానుభూతి పై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇంకా స్పష్టత లేదు. అందుకే దీనిపై ముందే జాగ్రత్త పడాలి. డిజిటల్ స్క్రీన్ల కంటే పిల్లలకు నిజ జీవిత స్నేహాలు, శారీరక వ్యాయామం, కుటుంబంతో గడిపే సమయం చాలా ముఖ్యం. మన పిల్లలు కంపెనీల లాభాల కోసం వాడే ప్రయోగశాల వస్తువులు కాదు. వారి భవిష్యత్తును కాపాడుకోవడానికి తల్లిదండ్రులు, పాఠశాలలు, ప్రభుత్వాలు కలిసికట్టుగా పోరాడాలి” అని WHO పిలుపునిచ్చింది.
ఇది కూడా చదవండి: India Billionaires: మన దేశ బిలియనీర్ల ఆదాయం ఎంత? నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి