
అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తిని మనం ప్రస్తుత సమాజంలో చూడలేం. అది లేకుండా అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి. ముఖ్యమైన సమాచారంతో పాటు బ్యాంకింగ్ సంబంధించిన యాప్స్, వ్యక్తిగత సమాచారం అంతా ఫోన్‌లోనే నిక్షిప్తమై ఉంటుంది. కొంతమంది ఫోన్లలోనే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు సేవ్ చేసుకుంటారు. అలాగే వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు కూడా అందులోనే సేవ్ అయ్యి ఉంటున్నాయి. అలాంటి స్మార్ట్ ఫోన్ అనుకోని విధంగా ఎక్కడైనా మిస్ అయితే! చాలా టెన్షన్ పడిపోతాం. మన సెన్సిటివ్ డేటా మొత్తం చోరీకి గురయ్యే అవకాశం ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో ఏం చేయాలి? పోయిన ఫోన్ నుంచి మన డేటాను ఎలా కాపాడుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా గూగుల్ ఓ అద్భుతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చింది. గూగుల్ ఫైండ్ మై డివైజ్ పేరిట తీసుకొచ్చిన ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ పోగొట్టుకున్న ఫోన్ నుంచి డేటాను కాపాడుకునేందుకు బాగా ఉపకరిస్తుంది. అలాగే పోయిన ఫోన్‌ని రిమోట్ గా ట్రాక్ చేయడానికి, దానిలోని డేటా ఎవరికంటా పడకుండా డేటా మొత్తం తొలగించడానికి ఇది యూజర్లకు సాయం చేస్తుంది. ఈ నేపథ్యంలో గూగుల్ ఫైండ్ మై డివైజ్ ఎలా పనిచేస్తుంది? తెలుసుకుందా రండి..
ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల కోసం గూగుల్ ఈ ప్రత్యేకమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది మీ డేటాను భద్రపరచడానికి మొదటి శ్రేణి రక్షణగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ మీ ఫోన్‌ను రిమోట్‌గా గుర్తించడంలో, దాన్ని లాక్ చేయడంలో లేదా అవసరమైతే మొత్తం డేటాను తొలగించడంలో కూడా మీకు సహాయపడుతుంది. అయితే మీ పరికరంలో ఈ ఫీచర్‌ను మీరు ఎనేబుల్ చేసి ఉంటేనే అది పనిచేస్తుంది.
మీరు ఫోన్‌ను గుర్తించడానికి, మీరు గూగుల్ వెబ్ బ్రౌజర్లోకి వెళ్లి (google.com/android/find)ఇలా టైప్ చేయండి. అలాగే వేరే మొబైల్ నుంచి కూడా దీనిని కనుగోనవచ్చు. అందుకోసం ఆ ఫోన్లో మీ మొబైల్ లింక్ చేసిన జీమెయిల్ ఐడీ ద్వారా సైన్ ఇన్ అవ్వండి. అప్పుడు కింద ఇంకా మీరు ఈ జీమెయిల్ కనెక్ట్ అయి ఉన్న ఫోన్ల లిస్ట్ మీకు కనిపిస్తుంది. దానిలో మీరు పోగొట్టుకున్న ఫోన్‌ను గుర్తించి దానిపై నొక్కడం ద్వారా దాన్ని మీరు ట్రాక్ చేయొచ్చు. అయితే దీనికి మీరు పొగొట్టుకున్న ఫోన్ ఆన్‌లో ఉండాలి. ఇంటర్‌నెట్‌కు కనెక్ట్ అయి ఉండాలి. ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటే అది ఆన్ అయి ఉన్న చివరి లొకేషన్ ను మాత్రమే చూపుతుంది.
దీని ద్వారా మీ ఫోన్ మీరు గుర్తించినప్పటికీ అది ఎక్కడుందో సరిగ్గా కనుగొనకపోతే “ప్లే సౌండ్” ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ అది సమీపంలో ఉంటే దాన్ని కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. మీ ఫోన్ దొంగిలించబడిందని మీరు విశ్వసిస్తే, మీరు బలమైన పిన్, పాస్‌వర్డ్ లేదా నమూనాతో దాన్ని రిమోట్‌గా లాక్ చేయవచ్చు. దీని ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను బయటి వ్యక్తులు తెరవకుండా, యాక్సెస్ చేయకుండా నిరోధిస్తుంది. అదనంగా, మీరు మీ ఫోన్‌లోని మొత్తం డేటాను కూడా తొలగించవచ్చు. అయితే ఈ డేటాను మీ ఫోన్ మళ్లీ దొరికినా డేటాను తిరిగి పొందలేరు. శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..