Train Tickets: రైలు టికెట్‌పై పేరు, బుకింగ్ తేదీలు మార్చుకోవాలా..? అయితే ఇలా చేయండి.

|

Dec 12, 2024 | 9:42 PM

భారతదేశంలో ఉన్న ట్రాన్స్‌పోర్టుల్లో ముఖ్యమైన వ్యవస్థ రైల్వే. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు రైలు ప్రయాణం ఇష్టపడతారు. అయితే కొన్ని సార్లు వివిధ కారణాల వల్ల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో టికెట్ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ టికెట్ రద్దు చేయకుండా మీ టికెట్ ద్వారా వేరే వ్యక్తులు ప్రయాణం చేసే వెసులుబాటును రైల్వే శాఖ తీసుకొచ్చింది.

Train Tickets: రైలు టికెట్‌పై పేరు, బుకింగ్ తేదీలు మార్చుకోవాలా..? అయితే ఇలా చేయండి.
train tickets
Follow us on

Indian Railways| భారతదేశంలో ఉన్న ట్రాన్స్‌పోర్టుల్లో ముఖ్యమైన వ్యవస్థ రైల్వే. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు రైలు ప్రయాణం ఇష్టపడతారు. అయితే చాలా మంది రైలు ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా ముందుగానే సీటు కన్ఫార్మ్ కోసం టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే కొన్ని సార్లు వివిధ కారణాల వల్ల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో టికెట్ రద్దు(Train Tickets) చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ టికెట్ రద్దు చేయకుండా మీ టికెట్ ద్వారా వేరే వ్యక్తులు ప్రయాణం చేసే వెసులుబాటును రైల్వే శాఖ తీసుకొచ్చింది. అలాగే టికెట్ బుకింగ్ తేదీని కూడా మార్చుకునే అవకాశం కల్పించింది.

మీరు బుక్ చేసుకున్న టికెట్‌ను రెండు పద్ధతుల ద్వారా మార్చుకోవచ్చు. ఒకటి ఆన్‌లైన్, రెండు ఆఫ్‌ లైన్. ఆన్‌లైన్ అంటే IRCTC యాప్ ద్వారా.. ఆఫ్‌లైన్ అంటే రిజర్వేషన్ కౌంటర్. ఇందుకోసం కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.

ఆన్‌లైన్‌లో ఎలా బదిలీ చేసుకోవాలి..?

ఐఆర్‌సీటీసీ(IRCTC) వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా లాగిన్ అవ్వాలి. అనంతరం ‘ప్యాసింజర్ నేమ్ రిక్వెస్ట్’ ఫారమ్ లింక్‌కి వెళ్లి, అక్కడి సూచనలను అనుసరించండి. అయితే ఐఆర్‌సీటీసీ నిబంధనల ప్రకారం కింది వ్యక్తులకు మాత్రమే మీ టికెట్‌ను బదిలీ చేసుకోవచ్చు. తల్లిదండ్రులు, తోబుట్టువులు, కొడుకు, కుమార్తె, భర్త లేదా భార్యతో కూడిన కుటుంబ సభ్యులకు మాత్రమే బదిలీ చేయవచ్చు. టికెట్ వారికి మాత్రమే బదిలీ చేయబడుతుంది. ఎవరి పేరు మీదికి మార్చాలో వారి పేరు, వయసు ఎంటర్ చేయాలి. అవసరమైన ఫీజు చెల్లించగానే టికెట్ మీద పేరు మారుతుంది. కొత్త ఈ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

ఆఫ్‌లైన్‌లో ఎలా బదిలీ చేసుకోవాలి..?

రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు సమీపంలోని రైల్వే రిజర్వేషన్(Railway Reservation) కార్యాలయానికి వెళ్లండి. అక్కడ సంబంధిత అధికారికి పేరు మార్పును అభ్యర్థిస్తూ రాతపూర్వక దరఖాస్తును సమర్పించండి. ఈ సమయంలో ఒరిజినల్ టికెట్ హోల్డర్, బదిలీ చేయాలనుకున్న ప్రయాణికుల ఇద్దరు ఐడీలు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం అధికారి అడిగే పత్రాలను అందజేయండి. ప్రభుత్వ ఉద్యోగులైతే రైలు బయలుదేరే 24 గంటల ముందు కూడా తమ ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు. అలాగే ఒక గ్రూప్‌గా కలిసి ప్రయాణిస్తున్నట్లయితే రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు రాతపూర్వక అభ్యర్థనను సమర్పించవచ్చు.

రైలు ప్రయాణ తేదీని కూడా మార్చుకోవడం ఎలా..?

మీ టికెట్ ప్రయాణ తేదీని మార్చుకోవడానికి రైలు బయలుదేరే సుమారు 48 గంటల ముందు ముందస్తు బుకింగ్ కౌంటర్‌లో ధృవీకరించిన టికెట్‌ను సమర్పిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసినా, ఆ టికెట్ ప్రతితో మీరు రైలు స్టేషన్‌లోని కౌంటర్‌కి వెళ్లాలి. అయితే RAC(రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్) టిక్కెట్‌లకు మాత్రమే తేదీ సవరణ అందుబాటులో ఉంటుంది. తత్కాల్, వెయిట్‌లిస్ట్ టికెట్‌ల తేదీ మార్పులకు అవకాశం ఉండదు. ఇలా మీరు టికెట్ ప్రయాణ తేదీని కానీ వేరొకరికి బదిలీ చేయడానికి కచ్చితంగా మీ ఒరిజినల్ ఐడీలు అందుబాటులో ఉంచుకోవాలి.

ఛార్జీలు వర్తిస్తాయా..?

పేరు మార్పు కోసం ఒక్కో ప్రయాణీకుడికి రూ. 100 వసూలు చేస్తారు. డేట్ మార్పు కోసం ఒక్కో టికెట్‌కు రూ. 200 తీసుకుంటారు. ఇతర తప్పుల సవరణకు రూ. 50 తీసుకుంటారు. కొత్త టికెట్ ఛార్జీ తక్కువగా ఉంటే డబ్బు వాపసు ఇవ్వరు. అలాగే ధర ఎక్కువ అయితే అదనపు ఛార్జీలు(Extra Charges) చెల్లించాల్సి ఉంటుంది.