
ఐవీఎఫ్, సరోగసీ వంటి వైద్య పద్ధతులు కొంతవరకు ఈ సమస్యను పరిష్కరిస్తున్నా, కొన్ని కేసుల్లో ఐవీఎఫ్ కూడా సఫలం కావడం లేదు. అలాంటి దంపతులకు ఇప్పుడు కృత్రిమ మేధ సరికొత్త పరిష్కారాన్ని చూపుతోంది. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ వైద్యులు ఏఐ సాయంతో ఈ అద్భుతాన్ని సాధించారు. ఈ వార్త సంతానం లేని జంటల్లో కొత్త ఆశలు రేపుతోంది.
సంతానం కోసం 19 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న ఓ దంపతులు 15 సార్లు ఐవీఎఫ్ చేయించుకున్నారు. ప్రతిసారీ నిరాశే ఎదురైంది. అయితే, వైద్యుల సహకారంతో ‘స్టార్’ (స్పెర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ) అనే కొత్త పరీక్షను ఆశ్రయించారు. ఈ పరీక్షలో ఏఐ సాంకేతికతను వినియోగించారు.
‘స్టార్’ అంటే స్పెర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ. మనుషుల కంటికి కనిపించని పనిని ఇక్కడ ఏఐ చేపట్టింది. స్టార్ టెక్నాలజీతో రూపొందించిన ఈ యంత్రం గంటకు 80 లక్షల ఫోటోలు తీస్తుంది. ఈ చిత్రాలలో ఏఐ అతి చిన్న, కంటికి కనిపించని శుక్రకణాలను గుర్తించి, వాటిని ఒక ప్రత్యేక యంత్రం ద్వారా సురక్షితంగా వేరు చేస్తుంది. ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి వైద్యులకు సుమారు ఐదేళ్లు పట్టింది.
సంతానం లేని ఈ దంపతులలో పురుషుడికి అజూస్పెర్మియా అనే సంతానలేమి సమస్య ఉంది. అమెరికాలో మొత్తం సంతానలేమి కేసులలో 10 శాతం వరకు దీని వల్లే సంభవిస్తాయి. అజూస్పెర్మియా అంటే పురుషుల వీర్యంలో శుక్రకణాలు కనిపించకపోవడం. ఒకవేళ ఉన్నా, అవి చాలా చిన్నవిగా, దాగి ఉండటం వల్ల మనుషులు గుర్తించడం కష్టం.
ఈ సమస్యకు రెండు కారణాలున్నాయి. ఒకటి అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా, అంటే శుక్రకణాల మార్గంలో అడ్డంకి ఉండటం. రెండోది నాన్-అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా. అంటే శరీరం సొంతంగా శుక్రకణాలను ఉత్పత్తి చేయలేకపోవడం.
స్టార్ ఏఐ సాంకేతికతను ఉపయోగించి, వైద్యులు పురుషుడి వీర్యంలో దాగి ఉన్న ఆరోగ్యకరమైన శుక్రకణాలను సేకరించారు. ఈ శుక్రకణాలలో ఒకదాన్ని అండంలోకి ప్రవేశపెట్టారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ మహిళ గర్భం దాల్చింది. 19 ఏళ్ల తర్వాత ఈ దంపతులు తల్లిదండ్రులయ్యే ఆనందాన్ని పొందబోతున్నారు.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న చిట్కాలు, సూచనలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. వీటిని నిపుణులైన వైద్య సలహాగా పరిగణించరాదు. ఏదైనా ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు లేదా ఆహారంలో మార్పులు చేసుకునే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.