
సాంకేతికతను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించిన HMD 2660 Flip Senior Editionలో పెద్ద డిస్‌ప్లే, ఫిజికల్ బటన్లు, ప్రాథమిక ఫోన్ ఫీచర్లతో పాటు AI సదుపాయాన్ని అందించారు. inTouch సంస్థతో HMD కుదుర్చుకున్న భాగస్వామ్యంలో భాగంగా Mary AI సేవను తీసుకొచ్చారు. సులభమైన భాషలో నెమ్మదిగా మాట్లాడేలా రూపొందించిన ఈ అసిస్టెంట్, గత సంభాషణల్లోని కొన్ని వివరాలను గుర్తుంచుకుని మరింత వ్యక్తిగతంగా స్పందించగలదు.
HMD 2660 Flip Senior Editionలోని మెయిన్ మెనూలో Maryని ఎంపిక చేసుకుని కాల్ బటన్ నొక్కితే AI సంభాషణ ప్రారంభించవచ్చు. ప్రకృతి, చరిత్ర వంటి అంశాలపై మాట్లాడటం, కథలు వినిపించడం, జ్ఞాపకశక్తికి సంబంధించిన ఆటలు నిర్వహించడం వంటి సదుపాయాలు ఉన్నాయి. ప్రారంభ యాక్టివేషన్ తర్వాత ప్రత్యేక లాగిన్ లేదా పాస్‌వర్డ్ అవసరం లేదు. ఈ సేవ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.
ఫోన్ కొనుగోలుతో మొదటగా 5 గంటల AI సంభాషణ సమయం ఉచితంగా లభిస్తుంది. ఆ తర్వాత నెలకు €19.90 సబ్‌స్క్రిప్షన్ చెల్లించాలి. మొబైల్ ఆపరేటర్ ఛార్జీలు అదనంగా వర్తిస్తాయి. సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా రెన్యువల్ కాదు. దీన్ని కొనసాగించకపోయినా సాధారణ ఫోన్ ఫీచర్లు పనిచేస్తాయి.
ఈ ఫోన్‌లో 2.8 అంగుళాల QVGA ప్రధాన డిస్‌ప్లే, 1.77 అంగుళాల సెకండరీ స్క్రీన్ ఉన్నాయి. Unisoc T107 ప్రాసెసర్, 48MB RAM, 128MB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. మైక్రోSD కార్డ్‌తో స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు. S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్ డ్యూయల్ నానో సిమ్‌లకు సపోర్ట్ చేస్తుంది.
వెనుకవైపు VGA కెమెరా, LED ఫ్లాష్‌తో పాటు 3.5mm హెడ్‌ఫోన్ జాక్, వైర్‌లెస్ FM రేడియో, MP3 ప్లేయర్ ఉన్నాయి. 4G VoLTE, Bluetooth 4.2, USB Type-C కనెక్టివిటీ సదుపాయాలు కల్పించారు. ఇందులో 1450mAh రిమూవబుల్ బ్యాటరీ ఉంది. కంపెనీ ప్రకారం, 2Gలో 20 గంటల వరకు, 4Gలో సుమారు 6.5 గంటల టాక్‌టైమ్ లభిస్తుంది.
ఈ ఫోన్ కోసి బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంది. యూకేలో దీని ధర £79.99 (సుమారు రూ.10,160)గా నిర్ణయించారు. ప్రస్తుతం HMD UK స్టోర్ ద్వారా విక్రయిస్తున్నారు. భారత మార్కెట్లో విడుదలకు సంబంధించిన వివరాలు ఇంకా స్పష్టంగా లేవు.