eSIM Scam: మీ ఫోన్ నంబర్ హైజాక్ చేస్తున్నారు జాగ్రత్త.. ఓటీపీ రాకుండానే ఖాతాలు కొల్లగొట్టేస్తున్నారు..

|

Aug 03, 2024 | 8:39 PM

ఈ-సిమ్ స్కామ్ కారణంగానే హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి రూ. లక్షకు పైగా పోగొట్టుకున్నాడు. ఓ ప్రైవేటు నంబర్ ద్వారా షేర్ అయిన ఏపీకే(APK) ఫైల్ పై క్లిక్ చేయడం ద్వారా తన ఖాతా నుంచి తనకు తెలియకుండా ఓటీపీలు కూడా లేకుండా ఖాతాను ఖాళీ చేశారు. ఇదెలా సాధ్యమైంది?

eSIM Scam: మీ ఫోన్ నంబర్ హైజాక్ చేస్తున్నారు జాగ్రత్త.. ఓటీపీ రాకుండానే ఖాతాలు కొల్లగొట్టేస్తున్నారు..
Esim
Follow us on

ఆన్ లైన్ స్కామ్ లు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఒక రోజు ఒక తరహా మోసాన్ని చూస్తుంటే.. రెండో రోజు మరో తరహాలో మోసం వెలుగుచూస్తోంది. దీంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఖాతాలు ఖాళీ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఓ ఈ-సిమ్ స్కామ్ బాగా భయపెడుతోంది. ఈ-సిమ్ స్కామ్ కారణంగానే హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి రూ. లక్షకు పైగా పోగొట్టుకున్నాడు. ఓ ప్రైవేటు నంబర్ ద్వారా షేర్ అయిన ఏపీకే(APK) ఫైల్ పై క్లిక్ చేయడం ద్వారా తన ఖాతా నుంచి తనకు తెలియకుండా ఓటీపీలు కూడా లేకుండా ఖాతాను ఖాళీ చేశారు. ఇదెలా సాధ్యమైంది? ఈ-సిమ్ స్కామ్ నుంచి మనల్ని మనం ఎలా సంరక్షించుకోవాలి తెలుసుకుందాం రండి..

ఇది మోసం..

హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగి ఇటీవల కొత్త ఆన్‌లైన్ మోసానికి గురై రూ.లక్షకు పైగా మోసపోయాడు. స్కామ్‌ ఎలా జరిగిందంటే.. అతని పేరు మీద తెలియని ఈసిమ్(eSIM)ని అనధికారికంగా యాక్టివేట్ చేశారు. ఇది ఎలాంటి వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) లేదా ప్రామాణీకరణ ప్రక్రియ లేకుండానే జరిగింది.

ఎలా జరిగిందంటే..

బాధితుడికి ఒక గుర్తు తెలియన వ్యక్తి నుంచి వాట్సాప్ లో ఓ మెస్సేజ్ వచ్చింది. దానిలో ఏపీకే ఫైల్ ఉంది. దాని పేరు ‘కస్టమర్ సపోర్టు’ అని ఉంది. ఆ మెసేజ్ పంపిన వ్యక్తి ఏపీకే ఫైల్ డౌన్ లోడ్ చేయాలని, కొత్త క్రెడిట్ కార్డు అప్లికేషన్ కోసం ఇది చేయాలని కోరడంతో ఆ వ్యక్తి అలాగే చేశాడు.
ఏపీకే అతని ఫోన్లో ఇన్ స్టాల్ అయిన వెంటనే.. దానిలో స్టోరే అయ్యి ఉన్న సున్నితమైన సమాచారం మొత్తాన్ని స్కామర్లు యాక్సెస్ సాధించారు. వారు కొత్త క్రెడిట్ కార్డ్ జారీకి అవసరమైన వివరాల పేరుతో సమగ్ర సమాచారాన్ని సేకరించి.. అకస్మాత్తుగా కమ్యూనికేషన్ ను డిస్ కనెక్ట్ చేశారు. అంతేకాక తన మొబైల్ నెట్‌వర్క్ మొత్తం నిలిచిపోయింది. ఎస్ఎంఎస్, కాల్స్, ఇలా ఏది పనిచేయకుండా స్కామర్లు చేశారు.

స్కామర్లు చేసిందిది..

బాధితుడి ఫోన్ నుంచి వివరాలను పొందిన తర్వాత, మోసగాళ్లు అతని ఫోన్ నంబర్‌ను ఉపయోగించి మరొక పరికరంలో ఈ-సిమ్ ని యాక్టివేట్ చేసుకున్నారు. అంటే బాధితుడి ఫోన్ నంబర్ కు వెళ్లాల్సిన మెసేజ్ లు, కాల్స్ లను నేరగాళ్లు మరొక నంబర్‌కు దారి మళ్లించారు. దీంతో వారి పని సులభతరం అయ్యింది. అనంతరం వారు తక్కువ సమయంలోనే రూ.1,06,650 అతని ఖాతా నుంచి కొల్లగొట్టేశారు. అనంతరం బాధితుడు నెట్‌వర్క్ కనెక్టివిటీని తిరిగి పొంది. అతని బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను తనిఖీ చేసినప్పుడు మాత్రమే ఏమి జరిగిందో గ్రహించాడు.

ఎలా సురక్షితంగా ఉండాలి..

ఈ ప్రత్యేక స్కామ్ సంఘటన అయాచిత సందేశాలు, డౌన్‌లోడ్‌లతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. అటువంటి మోసాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడంలో మీకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇవి..

  • తెలియని సోర్స్ నుంచి ఏపీకే ఫైల్‌లు లేదా ఏదైనా సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు. ప్రత్యేకించి అవి వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌ల ద్వారా వస్తే.. ఈ ఫైల్‌లు మీ పరికర భద్రతకు హాని కలిగించే మాల్వేర్‌ను కలిగి ఉండవచ్చు.
  • మిమ్మల్ని సంప్రదించే వ్యక్తి లేదా సంస్థ గుర్తింపును ఎల్లప్పుడూ ధ్రువీకరించండి, ప్రత్యేకించి వారు వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని అభ్యర్థిస్తే. చట్టబద్ధమైన కంపెనీలు అసురక్షిత ఛానెల్‌ల ద్వారా సున్నితమైన సమాచారాన్ని అడగవని గుర్తుంచుకోండి.
  • క్రెడిట్ కార్డ్‌ల వంటి కొత్త సేవల కోసం దరఖాస్తు చేసినప్పుడు, ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్‌లను ఉపయోగించండి లేదా భౌతిక శాఖలను సందర్శించండి. సందేశాల ద్వారా పంపబడిన లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి. ఎందుకంటే అవి మీ సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించబడిన ఫిషింగ్ వెబ్‌సైట్‌లకు దారితీయవచ్చు.

మరిన్నిటెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..