Google Play Music Going To Shut Down: ఒకప్పుడు పాటలు వినాలంటే రేడియోలు, వాక్‌మెన్‌లు అందుబాటులో ఉండేవి కానీ మారుతోన్న కాలానికి అనుగుణంగా పాట వినే విధానంలోనూ మార్పులు వచ్చాయి. మొబైల్ ఫోన్లు వచ్చాక పాటలను మెమొరీ కార్డుల్లో వేసుకొని వినేవారు. కానీ స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి రావడంతో మ్యూజిక్ కోసం కూడా ప్రత్యేకంగా యాప్‌లు వచ్చాయి. కేవలం ఇంటర్‌నెట్ ఆధారంగానే పాటలు వినే వెసులుబాటు కలిగింది.
ఇలాంటి పాపులర్ మ్యూజిక్ యాప్‌లలో ‘గూగుల్ ప్లే మ్యూజిక్’ ఒకటి. కొన్ని వేల పాటలతో వినియోగదారులకు సరికొత్త మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ అందించిన గూగుల్ మ్యూజిక్ సేవలు త్వరలోనే నిలిచిపోనున్నాయని గూగుల్ తెలిపింది. నిజానికి 2020 డిసెంబర్‌లోనే గూగుల్ మ్యూజిక్ యాప్‌ను నిలిపివేసినప్పటికీ.. ఈ యాప్‌లోని డేటాను డౌన్‌లోడ్ చేసుకోవడం, ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటును మాత్రం ఫిబ్రవరి 24 వరకు పొడిగించింది. అనంతరం యాప్‌లో ఉన్న డేటా పూర్తిగా డిలీట్ కానుంది. ఈ క్రమంలోనే గూగుల్ మ్యూజిక్‌లోని డేటాను.. యూట్యూబ్ మ్యూజిక్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని యూజర్లను కోరింది.
ఈ విషయమై గూగుల్ వినియోగదారులకు ఈమెయిల్స్ పంపించింది. యూజర్లు… music.google.com లేదా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల ద్వారా తమ డేటాను యూట్యూబ్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. వీటిలో ప్లేలిస్ట్, పాటలు, ఆల్బమ్స్, లైక్స్, అప్‌లోడ్ చేసిన డేటాలాంటివి ఉంటాయి. నిజానికి గూగుల్ ప్లే మ్యూజిక్ నిలిపివేత ప్రక్రియను గతేడాది అక్టోబర్ నుంచే ప్రారంభించి, డిసెంబర్ నాటికి పూర్తిగా ఆపేశారు. అయితే గూగుల్ ఇలా చేయడానికి ప్రధాన కారణం.. తన యూజర్లను ‘యూట్యూబ్ మ్యూజిక్’ వైపు ఆకర్షించడానికే. ఇందులో భాగంగానే యూట్యూబ్ మ్యూజిక్‌లో పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.
Also Read: Sandesh APP: కొత్త మెసేజింగ్ యాప్ తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం… వాట్సాప్‌కు పోటీగానేనా..?