ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ మొబైల్ ఫోన్ కంపల్సరీ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే.. వారికి అది జీవితంలో ఓ భాగంగా మారింది. ఇక ఇందులో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్.. ఇలా వారికి నచ్చిన నెట్‌వర్క్ సిమ్‌కార్డులను వాడుతున్నారు. ఇక మీరూ రోజూ వినియోగించే సిమ్‌కార్డు తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి. మరి ఒక ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులు తీసుకుంటారో తెలుసా.? మీ పేరుపై ఇప్పటివరకు ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఎప్పుడైనా చూశారా.? ఎవరైనా మీ సిమ్ దొంగతనం చేస్తే.? అప్పుడు బ్లాక్ చేయడం ఎలా.? అవన్నీ ఇప్పుడు తెలుసుకుందామా..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఒక్క ఆధార్ కార్డుపై 9 సిమ్ కార్డులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ తీసుకోవడం కుదరదు. అలాగే ఈ సిమ్‌లన్నీ కూడా ఒకే ఆపరేటర్ నుంచే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు సిమ్‌కార్డు పోగొట్టుకున్నా.. లేదా బ్లాక్ చేయాలని చూసినా.. ఒకవేళ వాడని సిమ్ కార్డులను ఏదైనా ఉన్నా కూడా.. ఇప్పుడు ఈజీగా ఇంటి దగ్గర నుంచే బ్లాక్ చేయవచ్చు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు ఇతరుల పేర్లపై సిమ్ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఆధార్‌తో లింకైన సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని టెలికాం శాఖ ఇటీవల టూల్ అనలటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్(TAFCOP)ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ వెబ్‌సైట్ ద్వారా మీ ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఒకవేళ వాటిని మీరు వినియోగించకపోయినా.. అవి ఎక్కడైనా పోగొట్టుకున్నా.. ఈజీగా బ్లాక్ చేయవచ్చు. దానికోసం మీరు చేయాల్సిందల్లా పైన పేర్కొన్న సైట్‌లోకి వెళ్లి.. మీ ఫోన్ నెంబర్.. ఆ తర్వాత అక్కడ ఉన్న Capatcha వాలీడేట్ చేస్తే.. మీ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఇక మీ పేరుపై ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయో.. అక్కడ దర్శనమిస్తాయి. తద్వారా మీరు వాడని నెంబర్స్ బ్లాక్ చేసుకోవచ్చు.