
Silent Calls: మీ మొబైల్‌కు ఏదో ఒక తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. తీరా లిఫ్ట్ చేస్తే అవతలి నుంచి మాట లేదు. మనిషి లేడు. కేవలం నిశ్శబ్దం! కొద్ది సెకన్ల తర్వాత కాల్ కట్ అవుతుంది. దీన్ని ఏదో నెట్‌వర్క్ సమస్య అనుకుని వదిలేస్తున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఇది సైబర్ నేరగాళ్లు విసురుతున్న కొత్త రకం వల. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. సైబర్ నేరగాళ్లు ఒకేసారి వేల సంఖ్యలో మొబైల్ నంబర్లకు ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా కాల్స్ చేస్తారు. దీని వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి.
1. మీ నంబర్ పని చేస్తోందా లేదా అని తెలుసుకోవడమే వీరి మొదటి లక్ష్యం. మీరు ఫోన్ ఎత్తగానే, ఆ నంబర్ యాక్టివ్ లో ఉందని వారి డేటాబేస్‌లో నమోదవుతుంది. ఆ తర్వాత మీకు రకరకాల స్కామ్ కాల్స్, లోన్ ఆఫర్లు, ఫ్రాడ్ మెసేజ్‌లు రావడం మొదలవుతాయి.
2. కొన్నిసార్లు మీరు హలో.. ఎవరు అని పదే పదే అడిగే వరకు వారు మౌనంగా ఉంటారు. మీ గొంతును రికార్డ్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో మీ వాయిస్‌ని క్లోనింగ్ చేస్తారు. ఆ తర్వాత మీ గొంతుతోనే మీ బంధువులకు ఫోన్ చేసి డబ్బులు అడిగే ప్రమాదం ఉంది.
3. మీరు ఆ నంబర్ నుంచి కాల్ కట్ అయిన తర్వాత ఎవరా? అని తిరిగి కాల్ చేస్తే మీ బ్యాలెన్స్ నుంచి భారీగా డబ్బులు కట్ అయ్యే అవకాశం ఉంది. ఇవి అంతర్జాతీయ ప్రీమియం నంబర్లు అయి ఉండొచ్చు.
మీకు పరిచయం లేని నంబర్ల నుంచి ముఖ్యంగా ఇతర దేశాల కోడ్‌లతో (+92, +44, +254 వంటివి) వచ్చే కాల్స్ ఎత్తకండి. ఫోన్ ఎత్తినప్పుడు అవతలి నుంచి మాట రాకపోతే, మీ పేరు చెప్పడం లేదా పదే పదే హలో అనడం చేయకండి. వెంటనే కాల్ కట్ చేయండి. మిస్డ్ కాల్ వచ్చింది కదా అని తెలియని నంబర్లకు తిరిగి కాల్ చేయకండి. అటువంటి నంబర్లను వెంటనే బ్లాక్ చేయండి. టెలికామ్ శాఖకు చెందిన చక్షు (Chakshu) పోర్టల్‌లో ఇటువంటి అనుమానాస్పద కాల్స్ గురించి రిపోర్ట్ చేయండి. సైబర్ నేరగాళ్లు చిన్న అజాగ్రత్తను ఆసరాగా చేసుకుని లక్షలు కొల్లగొడుతున్నారు. ఇలాంటి సైలెంట్ కాల్స్ వస్తే అప్రమత్తంగా ఉండటమే ఉత్తమ మార్గం.
ఇది కూడా చదవండి: Indian Software: రోడ్లు ఊడుస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నెలకు లక్ష రూపాయల జీతం!
ఇది కూడా చదవండి: Traffic Challans: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ చలాన్స్ రద్దు.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి