Aryabhata : భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించిన రోజు ఇవాళ. అనగా 19 – 04 – 1975 వ తేదీ సరిగ్గా ఇదే రోజున భారతదేశం తన మొదటి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ శాటిలైట్ పేరు ఆర్యభట్ట. ఈ ఉపగ్రహాన్ని భారత ప్రభుత్వం సోవియట్ యూనియన్ లోని కాపుస్తిన్న్ యార్ నుంచి కాస్మోస్ – 3ఎం అనే ఉపగ్రహ వాహక రాకెట్ సాయంతో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. ప్రాచీన భారత ఖగోళశాస్త్రవేత్త, గణితశాస్త్రజ్ఞుడు, జ్యోతిష్కుడు అయిన ఆర్యభట్ట జ్ఞాపకార్థం ఈ ఉపగ్రహానికి ఆ పేరు పెట్టారు. ఈ చారిత్రాత్మక దినోత్సవాన్ని జరుపుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ 1976, 1997 లలో నాటి 2 రూపాయల నోటుపై ఈ ఉపగ్రహ చిత్రాన్ని ముద్రించింది. ఆర్యభట్ట పూర్తిగా భారతదేశంలోనే నిర్మించిన ఉపగ్రహం దీన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టే సాంకేతిక విజ్ఞానం నాడు భారత్ కు అందుబాటులో లేదు. ఫలితంగా యూఆర్ రావు సారథ్యంలో 1972 లో సోవియట్ యూనియన్ తో ఒక ఒప్పందం జరిగింది. ఉపగ్రహం ప్రయోగించినందుకు ప్రతిఫలంగా భారత రేవుల నుంచి, ఓడల నుంచీ లాచింగ్ వాహనాల జాడలు ట్రాకింగ్ చేసేందుకు భారతదేశం సోవియట్ యూనియన్ కి అనుమతి ఇచ్చింది.
96.46 నిమిషాల ప్రదక్షిణ కాలం పట్టే కక్ష్యలో, 611 కిలోమీటర్ల అపోజీ (భూమి నుండి ఎక్కువ దూరం), 568 కిలోమీటర్ల పెరిజీ (భూమి నుండి దగ్గరి దూరం) ఎత్తులో, 50.6 డిగ్రీల ఏటవాలులో ఉండే కక్ష్యలో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించిన నాలుగు రోజుల తర్వాత 60 ప్రదక్షణలు పూర్తి చేసుకున్న ఉపగ్రహంలో విద్యుదుత్పత్తిలో లోపం కారణంగా పనిచేయడం మానేసింది. సోవియట్ యూనియన్ మీడియా వార్తల ప్రకారం, ఈ ఉపగ్రహం అటు తరువాత కూడా కొంతకాలం వరకు పనిచేసి సమాచారాన్ని పంపినట్లు తెలుస్తుంది. ఈ ఉపగ్రహం 1992 ఫిబ్రవరి 11 న తిరిగి భూవాతావరణంలో ప్రవేశించింది. 360 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని నిర్మించింది ప్రొఫెసర్ యు.ఆర్.రావు. ఆ సమయంలో ఇస్రో ఛైర్మన్ సతీష్ ధావన్. 1969 అగస్టు 15న ఇస్రోను స్ధాపించిన తరువాత ఆరేళ్లకు 1975 లో తొలి ఉపగ్రహ ప్రయోగం ఇది.
సోవియట్ గడ్డపై నుంచి తొలి ఉపగ్రహాన్ని నాడు ప్రయోగించగా, మన గడ్డపై నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం రోహిణి. శ్రీహరికోట నుంచి 1979, అగస్లు 10న విజయవంతంగా ప్రయోగించిన రోహిణి-1 ఉపగ్రహం ఇది.. భారతదేశం నుండి ప్రయోగించిన తొట్ట తొలి ఉపగ్రహంగా చరిత్రలో నిలిచిపోయింది. నాటి నుంచి నేటి వరకూ ఇస్రో ఆధ్వర్యంలో 101 అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి. 71 లాంచ్ మిషన్లు, 2 రీ ఎంట్రీ మిషన్ల ప్రయోగం. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి భారతదేశం సహాయాన్ని పొందే స్థాయికి చేరిన ఇస్రో ఇప్పటివరకూ 226 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. వీటిలో 179 విదేశాలకు చెందినవి కావడం మన ఇస్రో సత్తాకు నిదర్శనం. 2017లో ఒకే రాకెట్టుతో 104 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించింది ఇస్రో. ఇందులో 96 ఉపగ్రహాలు అమెరికాకు చెందినవి కావడం విశేషం.