దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చాలా ప్రాంతంలో వీటిని మొబైల్ వినియోగదారులు ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో 5జీ స్మార్ట్ ఫోన్ల వినియోగం పెంచేందుకు టెలికాం కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా భారతీ ఎయిర్ టెల్ సంస్థ ముందడుగు వేసింది. 5జీ స్మార్ట్ ఫోన్ల కోసం పోకో, వన్ ప్లస్, గ్జియోమి, రియల్ మీ, ఆపిల్ తదితర వాటితో ఒప్పందం కుదుర్చకుంది.
దేశంలో 5జీ వినియోగాన్ని పెంచడంలో భాగంగా హ్యాండ్ సెట్లను తక్కువ ధరకు అందించడానికి భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మన దేశంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలే ఎక్కువ. స్మార్ట్ ఫోన్ల కోసం వారు ఎక్కువ డబ్బులు ఖర్చుచేయలేరు. ఈ నేపథ్యంలో ఫోన్ ధర రూ.10 వేలు కంటే తక్కువగా ఉన్నప్పుడే 5జీకి ఆదరణ పెరుగుతుంది. స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకోతో భారతీ ఎయిర్‌టెల్ ఇటీవల ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా డేటా బండ్లింగ్‌తో పాటు 5G స్మార్ట్‌ఫోన్ ధరను రూ. 8,799కి తగ్గించింది. ఇతర హ్యాండ్‌సెట్ తయారీదారులతో కూడా ఇలాంటి తగ్గింపు ధరలకు ఫోన్లు విడుదల చేయనుంది.
రిలయన్స్ రిటైల్‌తో కలిసి రిలయన్స్ జియో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లను అందించడానికి కృషి చేస్తోంది. డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ఫోన్ల అమ్మకాలను పెంచడానికి ప్రతి రెండు, మూడు నెలలకు ఆఫర్లు తీసుకురానుంది. 5జీ ఫోన్లు ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తే డేటా వినియోగం ఎక్కువవుతుందని, టెలికాం సంస్థలకు సగటు ఆదాయాన్ని పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
దేశంలోని టైర్ 2, 3 నగరాల్లో కూడా ఎయిర్ టెల్ తన నెట్ వర్క్ ను విస్తరిస్తోంది. అనేక చోట్ల నెక్ట్స్ జెన్ యాజమాన్యం ఆధ్వర్యంలో స్టోర్ లను ప్రారంభించింది. వీటి ద్వారా రిటైల్ అమ్మకాలు పెరుగుతాయని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయని భావిస్తోంది. ఇందులో భాగంగా గతేడాదితో పోల్చితే తన స్టోర్ల సంఖ్యను దాదాపు 50 శాతానికి పెంచింది. రద్దీగా ఉండే ప్రతి వీధిలోనూ వీటిని విస్తరిస్తోంది. 2023 మార్చి నాటికి ఎయిర్ టెల్ కు 1000 స్టోర్లు ఉన్నాయి. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల కారణంగా అవి 1500 చేరే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణుల అంచనా.
ఐడీసీ ఇండియా అసోసియేట్ ఉపాధ్యక్షుడు నవ్‌కేందర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం..రివర్స్ బండ్లింగ్ (టెల్కో-స్మార్ట్‌ఫోన్ ఫర్మ్ పార్టనర్‌షిప్) అనేది భారత మార్కెట్‌లో ఎప్పటి నుంచో ఉంది. ఎయిర్‌టెల్-పోకో టై అప్ అనేది ఇప్పుడు కొత్తగా జరిగింది. దీని ద్వారా రూ. 10 వేల కంటే తక్కువ ధరల విభాగంలో 5G ఫోన్లు అందుబాటులో వస్తాయి. ఇతర కంపెనీల నుంచి కూడా ఇలాంటి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడానికి వీలు కలుగుతుంది.
స్మార్ట్ ఫోన్ నెట్ వర్క్ లో ఎయిర్ టెల్ కు 65 మిలియన్లు, జియోకు 90 మిలియన్ల 5 జీ వినియోగదారులు ఉన్నారు. భారతీ ఎయిర్ టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ ఇటీవల మాట్లాడుతూ మొత్తం స్మార్ట్‌ఫోన్ బేస్‌కు 5జీ వినియోగదారుల సహకారం ఇప్పటికీ చాలా తక్కువగా ఉందన్నారు. అది కేవలం 15 నుంచి 16 శాతమే అని చెప్పారు. కొత్తగా తీసుకుంటున్న నిర్ణయాలతో 2025 మార్చి నాటికి 25 శాతం పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..