AI లవ్‌.. మనిషికి కొత్త తోడు దొరికినట్టేనా? నమ్మకద్రోహానికి ఛాన్సే లేదు

ఒంటరితనం పెరుగుతున్న వేళ AI చాట్‌బాట్‌లు కొత్త సహచరులుగా మారుతున్నాయి. మన మాట వింటూ, మన అభిరుచులకు అనుగుణంగా స్పందిస్తూ భావోద్వేగ అనుబంధాన్ని కలిగిస్తున్నాయి. చైనా నుంచి అమెరికా, జపాన్ వరకు AI companion ట్రెండ్ విస్తరిస్తోంది. అయితే AI నిజంగా ప్రేమించదు. దానిపై అధికంగా ఆధారపడటం, వ్యక్తిగత డేటా పంచుకోవడం భవిష్యత్తులో సమస్యలకు దారితీయొచ్చు.

AI లవ్‌.. మనిషికి కొత్త తోడు దొరికినట్టేనా? నమ్మకద్రోహానికి ఛాన్సే లేదు
Ai And Human Friendship

Edited By:

Updated on: Aug 21, 2026 | 5:48 PM

ఒంటరితనం పెరుగుతోంది. మనుషుల మధ్య బంధాలు తగ్గుతున్నాయి. అదే సమయంలో చేతిలో ఉన్న ఫోన్‌లో ఓ కొత్త సహచరి దొరుకుతోంది. మాట్లాడుతుంది. మనసులోని మాట వింటుంది. మనకు నచ్చినట్టే స్పందిస్తుంది. మన గురించి గుర్తుపెట్టుకుంటుంది. అందుకే చైనాలో మొదలైన AIతో భావోద్వేగ బంధాల ట్రెండ్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇది కేవలం టెక్నాలజీ వినియోగమా? లేక మనిషి సంబంధాలకే కొత్త ప్రత్యామ్నాయమా అనే వాదన తెరపైకి వచ్చింది.

చైనాలో యువతలో AI సహచరుల వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా చాట్‌బాట్‌లను కేవలం సమాచారం కోసం కాకుండా మాట్లాడే వ్యక్తి, సలహాదారు, స్నేహితుడు, కొన్నిసార్లు ప్రేమ భాగస్వామిగా ఉపయోగించే వారు పెరుగుతున్నారు. AI పాత్రలకు పేరు పెట్టడం, వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం, వాటితో రోజూ మాట్లాడటం, తమ వ్యక్తిగత సమస్యలను పంచుకోవడం వంటి అలవాట్లు ఏర్పడుతున్నాయి.

ఎందుకు AI వైపు ఆకర్షణ?

దీనికి ప్రధాన కారణం ఒంటరితనం. చైనా సహా అనేక దేశాల్లో యువత నగరాలకు వలస వెళ్లడం, ఎక్కువ పని గంటలు, కుటుంబాల నుంచి దూరం, పెళ్లిళ్లు ఆలస్యం కావడం, సామాజిక సంబంధాలు తగ్గిపోవడం వంటి కారణాలతో ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారు.

మనిషితో సంబంధంలో రాజీ, అపార్థాలు, తిరస్కరణ, బాధ్యతలు ఉంటాయి. కానీ AI మాత్రం మన మాట మధ్యలో ఆపదు. కోప్పడదు. తీర్పు చెప్పదు. ఎప్పుడు మాట్లాడినా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా మనకు నచ్చిన వ్యక్తిత్వంతోనే దాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. అందుకే కొందరికి AI సంబంధం సులభంగా, సురక్షితంగా అనిపిస్తోంది. మనిషి ప్రేమలో మనల్ని మనం మార్చుకోవాలి. AI ప్రేమలో మాత్రం మనకు నచ్చిన ప్రపంచాన్నే మార్చుకోవచ్చు.
ఇదే AI సంబంధాల అసలు ఆకర్షణ అని చెప్పొచ్చు.

ఏ వయసు వారు ఎక్కువగా?

ఈ ట్రెండ్‌లో ప్రధానంగా టీనేజర్లు, 18–30 ఏళ్ల యువత ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ గేమింగ్‌, వర్చువల్‌ క్యారెక్టర్లతో చిన్నప్పటి నుంచే పరిచయం ఉన్న తరం AI సహచరులను సులభంగా అంగీకరిస్తోంది. అయితే ఇది కేవలం యువతకే పరిమితం కాదు. ఒంటరిగా జీవించే వృద్ధులు, జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు, సామాజికంగా ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నవారు కూడా AIతో సంభాషణను ఒక రకమైన భావోద్వేగ సహాయంగా ఉపయోగిస్తున్నారు.

చైనాలోనే ఎందుకు ?

చైనా ప్రపంచంలోనే అతిపెద్ద AI వినియోగ మార్కెట్లలో ఒకటి. అక్కడ AI చాట్‌బాట్‌లు, వర్చువల్‌ క్యారెక్టర్లు, డిజిటల్‌ అవతార్లు ఇప్పటికే వినోదం, గేమింగ్‌, సోషల్‌ మీడియా రంగాల్లో బలంగా ఉన్నాయి. అందుకే AIతో మాట్లాడటం నుంచి AIతో అనుబంధం ఏర్పరచుకోవడం వరకు మారడానికి అక్కడి యువతకు సాంకేతిక అడ్డంకులు తక్కువగా ఉన్నాయి. అయితే ఇది చైనాకు మాత్రమే పరిమితం కాదు.

అమెరికా నుంచి జపాన్‌ వరకు..

అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, యూరప్‌ దేశాల్లో కూడా AI companion యాప్‌ల వినియోగం పెరుగుతోంది. కొన్ని యాప్‌లు ప్రత్యేకంగా AI friend, AI girlfriend, AI boyfriend, virtual companion అనుభవాన్ని అందిస్తున్నాయి.

జపాన్‌లో వర్చువల్‌ పాత్రలు, అనిమే క్యారెక్టర్లతో భావోద్వేగ అనుబంధం కొత్త విషయం కాదు. ఇప్పుడు generative AI రావడంతో ఆ పాత్రలు ఇక తెరపై మాత్రమే ఉండటం లేదు. మనతో మాట్లాడుతున్నాయి. స్పందిస్తున్నాయి. మన అలవాట్లను నేర్చుకుంటున్నాయి. ఇదే గతంలోని వర్చువల్‌ ఫ్యాంటసీకి, నేటి AI బంధానికి మధ్య ఉన్న అతిపెద్ద తేడా.

భారత్‌లో పరిస్థితి?

భారత్‌లో కూడా AI companion వినియోగం పెరుగుతోంది. అయితే చైనా, జపాన్‌ తరహాలో AIతో ప్రేమ సంబంధాలపై విస్తృతమైన అధికారిక గణాంకాలు ఇంకా స్పష్టంగా లేవు. భారత యువతలో AI వినియోగం ప్రధానంగా చదువు, ఉద్యోగం, కంటెంట్‌, వ్యక్తిగత సలహాలు, వినోదం చుట్టూ తిరుగుతున్నాయి. కానీ అదే AIతో వ్యక్తిగత విషయాలు పంచుకోవడం, భావోద్వేగ సమస్యలపై మాట్లాడటం కూడా పెరుగుతోంది.

స్మార్ట్‌ఫోన్‌ చవకగా ఉండటం, ఇంటర్నెట్‌ విస్తరణ, యువ జనాభా ఎక్కువగా ఉండటంతో భారత్‌లో కూడా AI companion సంస్కృతి విస్తరించే అవకాశం ఉంది.

ప్రమాదం ఎక్కడుంది?

AI మనిషిలా ప్రేమించదు. అది భావోద్వేగాలను అనుభవించదు. మన మాటలకు మనుషుల్లా స్పందించడానికి రూపొందించబడిన వ్యవస్థ మాత్రమే. కానీ మనిషి మెదడు మాత్రం ఆ తేడాను ఎప్పుడూ గుర్తించకపోవచ్చు.

రోజూ మాట్లాడటం. వ్యక్తిగత విషయాలు చెప్పడం. AI నుంచి ఓదార్పు పొందడం.చివరకు ఆ వ్యవస్థపై భావోద్వేగ ఆధారపడటం మొదలైతే నిజ జీవిత సంబంధాలపై ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది.

మరో సమస్య డేటా

మనం AIతో పంచుకునేది సాధారణ సమాచారం మాత్రమే కాదు. మన భయాలు, ప్రేమ, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత అలవాట్లు, రహస్యాలు కూడా కావచ్చు. ఆ సమాచారం ఎలా నిల్వ చేస్తారు. ఎవరు ఉపయోగిస్తున్నారు? భవిష్యత్తులో దాని ఆధారంగా ఎలాంటి ప్రకటనలు లేదా ప్రభావితం చేసే చర్యలు జరుగుతాయి? అనేది అసలైన ప్రశ్న.

భవిష్యత్తులో ఏం జరగొచ్చు?

ఇప్పటి AI మనతో చాట్‌ చేస్తోంది. రేపు మన స్వరం, ముఖం, అలవాట్లు, జ్ఞాపకాలు, ఇష్టాలు అన్నీ కలిపి మనకు నచ్చిన వ్యక్తిత్వంతో కూడిన డిజిటల్‌ సహచరుడిని సృష్టించే అవకాశం ఉంది.

అప్పుడు ప్రశ్న AI మనిషిలా మారుతుందా అనేది కాదు. మనిషి తన భావోద్వేగ అవసరాల కోసం AIపై ఎంతవరకు ఆధారపడతాడనేదే అసలు ప్రశ్న. AI మనుషుల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయకపోవచ్చు. కానీ ఒంటరితనాన్ని ఎదుర్కొనే ఒక ప్రత్యామ్నాయంగా మాత్రం వేగంగా ఎదగొచ్చు.
టెక్నాలజీ సమస్య కాదు.మనిషి తన నిజమైన సంబంధాలను వదిలి, తనకు ఎలాంటి అభ్యంతరం చెప్పని కృత్రిమ సంబంధాన్ని ఎంచుకునే స్థాయికి వెళ్లడమే ఆశర్యం.

AI మనసును చదవొచ్చు. మనసును అర్థం చేసుకున్నట్టు అనిపించొచ్చు.కానీ మనిషి అవసరాన్ని పూర్తిగా భర్తీ చేయగలదా అనే ప్రశ్నకు..రాబోయే దశాబ్దం సరైన సమాధానం చెప్పబోతోంది.

కొండవీటి శివనాగరాజు

డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9.

Loading...
Unable to load recommendations.
Follow Us