India vs Australia: రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ వస్తోన్న పరుగుల మెషీన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు కాసింత దూరంలోనే ఉన్నాడు.. రేపు ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లోనే ఈ రికార్డు పూర్తి కావాలన్నది అభిమానుల కోరిక.. వన్డేలలో 12 వేల పరుగులు సాధించడానికి కోహ్లీ మరో 133 పరుగుల దూరంలో ఉన్నాడంతే! రేపటి మ్యాచ్‌లో కోహ్లీ ఆ పరుగులు సాధిస్తే మాత్రం గొప్ప రికార్డే అవుతుంది.. 12 వేల పరుగులను పూర్తి చేసుకున్న ఆరో క్రికెటర్ అవ్వడం గొప్ప కాదు కానీ 300 ఇన్నింగ్స్‌ల కంటే తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించిన తొలి క్రికెటర్ గా నిలిచిపోతాడు కోహ్లీ.. కోహ్లీ ఇప్పటి వరకు వన్డేలలో 248 మ్యాచ్‌లు ఆడాడు.. 239 ఇన్నింగ్స్‌లలో 11, 867 పరుగులు సాధించాడు.. ఇందులో 43 సెంచరీలు, 58 అర్థ సెంచరీలు ఉన్నాయి.. వన్డేలలో కోహ్లీ యావరేజ్ కూడా బ్రహ్మంగానే ఉంది.. 59.34 సగటు అంటే మాటలు కాదు.. స్ట్రయిక్ రేటు కూడా 93.25గా ఉంది.. ఏ లెక్కన చూసినా వన్డేలలో కోహ్లీది తిరుగులేని రికార్డే! రేపటి నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌తో పాటు, మూడు టీ-20ల సిరీస్‌ను కూడా కోహ్లీ ఆడతాడు. టెస్ట్ సిరీస్‌లో మాత్రం మొదటి టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడు. తన భార్య అనుష్క శర్మ తొలి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉండటంతో తొలి టెస్ట్ తర్వాత ఇండియాకు వచ్చేస్తున్నాడు కోహ్లీ.. చివరి రెండు టెస్ట్‌లకు దూరం కానున్నాడు.