T20 World Cup 2026 : కథ మారింది..సీన్ అదిరింది..హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్ ఛాంపియన్స్ ప్రచారం

T20 World Cup 2026 : భారత క్రికెట్‌లో ఒక సరికొత్త శకం మొదలైంది. సాధారణంగా మహిళా క్రికెటర్ల టోర్నమెంట్లు వస్తున్నాయంటే పురుష క్రికెటర్లు వచ్చి మా అమ్మాయిలకి సపోర్ట్ చేయండి అని కోరడం మనం ఇప్పటివరకు చూశాం. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది.

T20 World Cup 2026 : కథ మారింది..సీన్ అదిరింది..హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్ ఛాంపియన్స్ ప్రచారం
T20 World Cup 2026

Updated on: Jan 12, 2026 | 10:34 AM

T20 World Cup 2026 : భారత క్రికెట్‌లో ఒక సరికొత్త శకం మొదలైంది. సాధారణంగా మహిళా క్రికెటర్ల టోర్నమెంట్లు వస్తున్నాయంటే పురుష క్రికెటర్లు వచ్చి మా అమ్మాయిలకి సపోర్ట్ చేయండి అని కోరడం మనం ఇప్పటివరకు చూశాం. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న 2026 పురుషుల టీ20 ప్రపంచకప్ కోసం జియో స్టార్ ఒక అద్భుతమైన ప్రోమోను విడుదల చేసింది. ఇందులో ప్రపంచ విజేతలుగా నిలిచిన మన భారత మహిళా క్రికెటర్లు, పురుషుల జట్టు కోసం ప్రచారం చేయడం విశేషం. ఈ రోల్ రివర్సల్ కాన్సెప్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఈ ప్రోమోలో స్టార్ క్రికెటర్లు షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు కనిపిస్తున్నారు. గతేడాది నవంబర్ 2న మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. “మా కల నిజమైంది, ఒక కప్పు ఇంటికి తెచ్చాం. ఇప్పుడు మా అబ్బాయిల వంతు వచ్చింది. ఆ కప్పును కూడా మన దేశం దాటి పోనివ్వం. మా అమ్మాయిల కంటే మా అబ్బాయిలేం తక్కువ కాదు” అంటూ వారు చెప్పే డైలాగులు అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. ముఖ్యంగా మహిళా ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్ వంటి పురుష క్రికెటర్ల జెర్సీలు ధరించి కనిపించడం ఈ ప్రోమోకే హైలైట్‌గా నిలిచింది.

గతంలో 2025 మహిళా ప్రపంచకప్ ముందు రోహిత్ శర్మ ప్రోమోలో కనిపించి మహిళా జట్టుకు మద్దతు తెలపాలని కోరారు. కానీ ఇప్పుడు మహిళా ఛాంపియన్లే పురుషుల జట్టును వెన్నుతట్టి ప్రోత్సహించడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “స్టార్ స్పోర్ట్స్ టీమ్ ఈసారి సిక్సర్ కొట్టింది. కాన్సెప్ట్ అదిరిపోయింది. అమ్మాయిలు-అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరూ ఒకటే అని నిరూపించారు” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సరికొత్త ప్రయోగం మార్కెటింగ్ రంగంలో ఒక బెంచ్ మార్క్‌గా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఇప్పుడు ఆ టైటిల్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యువ జట్టుపై ఉంది. రోహిత్, విరాట్ వంటి సీనియర్లు లేని ఈ కొత్త టీమ్ ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో జరిగే మ్యాచ్‌తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాది పాకిస్థాన్‌తో జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మహిళా జట్టు ఇచ్చిన ఈ పాజిటివ్ ఎనర్జీతో పురుషుల జట్టు కూడా కప్పు కొడుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..