టీమిండియా-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో విశాఖ టెస్టులో రోహిత్ శర్మ వీరవిహారం చేయడంతో అతడిపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే రోహిత్ టెస్టుల్లో ఎలా ఆడతాడో అనే దానిపై ఫోకస్ పెట్టడం తగ్గించాలంటూ క్రీడా విశ్లేషకులను, మీడియాను టీమిండియా సారథి విరాట్ కోహ్లి విజ్ఞప్తి చేశాడు. రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే రెండో టెస్టుకు ముందు ఏర్పాటు చేసిన ప్రి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కోహ్లి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘రోహిత్ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అతడి అనుభవాన్నంతా ఉపయోగించి తొలి టెస్టులో అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా రెండో టెస్టులో అతడి దూకుడైన ఆటతో మ్యాచ్‌పై మాకు మరింత పట్టు దొరికింది. టాపార్డర్ బ్యాట్స్‌మన్ రాణింపుపైనే గెలుపోటములు ఆధారపడతాయి. అనుభవజ్ఞుడైన రోహిత్ ఓపెనర్‌గా ఉండటం జట్టుకు లాభిస్తుంది. అయితే అతడి నుంచి మరిన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నాం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎలాంటి ఆటనైతే అతడిలో చూశామో టెస్టుల్లోనూ అదే ఆటను కొనసాగించాలని కోరుకుంటున్నాం. అయితే రోహిత్ టెస్టుల్లో ఓపెనర్‌గా ఎలా ఆడతాడు అనే దానిపై అందరూ ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీంతో అతడిపై ఒత్తిడి ఎక్కువైంది. క్రీడా విశ్లేషకులకు, మీడియాకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. అతడి పాటికి అతడిని ఆడనివ్వండి, రోహిత్‌పై ఫోకస్ తగ్గించుకోండి’ అంటూ కోహ్లి పేర్కొన్నాడు.
ఇక రేపటి నుంచి భారత్- దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టు పుణే వేదికగా జరగనుంది. ఇప్పటికే తొలి టెస్టులో గెలిచి ఉత్సాహంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఆరాటపడుతుండగా.. ఎలాగైన రెండో టెస్టులో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని పర్యాటక సఫారీ జట్టు ఆరాటపడుతోంది. ఇక రెండో టెస్టు కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.